Begin typing your search above and press return to search.

తెలంగాణ లో విషాదం : వైరస్ తో ఏడు రోజుల చిన్నారి మృతి.. !

By:  Tupaki Desk   |   28 May 2020 5:30 AM GMT
తెలంగాణ లో విషాదం : వైరస్ తో ఏడు రోజుల చిన్నారి మృతి.. !
X
హైదరాబాద్‌ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వైరస్ మహమ్మారి ముక్కుపచ్చలారని ఏడు రోజుల నవజాత శిశువును బలి తీసుకుంది. అయితే, ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. మూడు రోజుల క్రితం పసికందులో కరోనా లక్షణాలు కనిపించగా సోమవారం రాత్రి ప్రాణాలు విడిచింది. మరణించిన తర్వాత కరోనా పరీక్షలు చేయగా.. ఆ పాపకు వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్‌కి చెందిన జంట.. గత పదేళ్లుగా జీ ప్లస్ 1లో ఉంటున్నారు. వారం క్రితం గర్భవతి నీలోఫర్ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. తర్వాత తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ చిన్నారికి వైరస్ సోకింది. కానీ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకున్నా.. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది.ప్రసవానికి ముందు ఆ పసికందు తల్లికి వైరస్ టెస్టు చేయగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కుటుంబ సభ్యులెవరికీ కరోనా లక్షణాలు లేవు. దీంతో హాస్పిటల్‌లోనే ఆ చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.

ఆ చిన్నారి కుటుంబం ఉండే ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ ‌గా ప్రకటించారు. గత కొద్ది రోజులు ప్రజలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారని.. అదే సమయంలో వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా వైరస్ సోకి 7 రోజుల పాప చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వైరస్ సోకి చనిపోయిన పిన్న వయస్సు గల చిన్నారిగా నిలిచారు. కాగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2098కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కు చేరింది.