Begin typing your search above and press return to search.

టోక్యో ఒలంపిక్స్ : 7 పథకాలు .. 7 కథలతో భారత్

By:  Tupaki Desk   |   9 Aug 2021 8:37 AM GMT
టోక్యో ఒలంపిక్స్ : 7 పథకాలు .. 7 కథలతో భారత్
X
విశ్వ క్రీడా మహోత్సవం ముగిసింది. టోక్యోలో ఒలింపిక్ వేడుకలు నిన్నటి తో  పూర్తయ్యాయి. ముగింపు వేడుకలను ఘనంగా ముగించారు. గత నెల 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్‌ క్రీడలు జరిగాయి. 17రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరినీ అలరించాయి. టోక్యో ఒలింపిక్స్‌ లో 113 పతకాలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 88 పతకాలతో చైనా రెండో స్థానలో నిలిచింది. 58 పతకాలతో జపాన్‌ మూడో స్థానంలో ఉంది. ఒలింపిక్స్‌ లో ఈసారి భారత్ మెరుగైన ప్రదర్శనే చేసింది. 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచింది.  నాలుగు దశాబ్దాల తర్వాత భారత హాకీ అదిరిపోయిందనుకుంటే...  అంతకుమించిపోయే అబ్బుర ఫలితం అథ్లెటిక్స్‌ లో వచ్చింది. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్‌ భారత్‌ కు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది.
 
పతకాల్ని త్రుటిలో కోల్పోయిన పోరాట యోధులు కూడా ఇక్కడ విజేతలే, ఎందుకంటే ఇక్కడ ఫలితమే తేడా. కానీ పోరాటంలో విజేతకి పరాజితకి తేడా లేదంటే అతిశయోక్తి కాదు. మహిళల హాకీ జట్టు కాంస్యానికి దూరమైనా ప్రదర్శనతో మన గుండెల్లో నిలిచింది. రెజ్లర్‌ దీపక్‌ పూనియా, గోల్ఫర్‌ అదితి పతకాలకు చేరువై చివరకు దూరమయ్యారు. మొత్తానికి టోక్యోలో మన క్రీడాకారుల శ్రమకు మంచి ఫలితాలే వచ్చాయి.

ఈ ఒలింపిక్స్‌ లో మీరాబాయి చాను శుభారంభమే నీరజ్‌ బంగారానికి పునాది వేసింది. ఆరంభ వేడుకలు ముగిసి పోటీలు మొదలైన తొలి రోజే ఆమె రజతంతో బోణీ కొట్టింది. ‘లండన్‌’ దాటేందుకు ఈ వెయిట్‌ లిఫ్టరే జేగంట మోగించింది. 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్‌ మహిళామణి 202 కేజీల  బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. ‘రియో’లో భారత ఆశల పల్లకిని ఫైనల్‌దాకా మోసిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు. బ్యాడ్మింటన్‌లో రన్నరప్‌ అయిన సింధు పతకం రంగుమార్చాలని, స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తనకెదురైన జపాన్‌ స్టార్‌ అకానె యామగుచిని క్వార్టర్స్‌లో మట్టికరిపించిన తెలుగు తేజం దురదృష్టవశాత్తు సెమీస్‌లో తడబడింది. వరల్డ్‌ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ కు తలవంచిన 26 ఏళ్ల సింధు కాంస్య పతక పోరులో మాత్రం పట్టువీడని పోరాటం చేసింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ క్రీడల్లో పతకాలు  గెలిచిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది.

భారత్‌ ‘టోక్యో డ్రీమ్స్‌’లో అథ్లెటిక్స్‌ పతకం ఉంది. కానీ పసిడి మాత్రం లేదు. నీరజ్‌ చోప్రా ఆ టోక్యో డ్రీమ్స్‌ ఊహకే అందని విధంగా జావెలిన్‌ విసిరేశాడు. 23 ఏళ్ల ఈ ఆర్మీ నాయక్‌ సుబేదార్‌ విశ్వక్రీడల్లో  బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్‌ పాజిబుల్‌’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్‌ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. రెజ్లింగ్‌లో హరియాణా బాహుబలి రవి దహియా. తన శారీరక సామర్థ్యానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించిన రవి మల్లయుద్ధంలో మహాబలుడు. ఛత్రశాల్‌ స్టేడియం చెక్కిన మరో చాంపియన్‌ రెజ్లర్‌. పసిడి వేటలో కాకలు తిరిగిన సింహబలుడితో చివరకు పోరాడి ఓడాడు. 57 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో  రజతం సాధించి భారత వెండికొండగా మారాడు.

ఒలింపిక్స్‌ హకీ ఘన చరిత్రను మనకూ తెలియజేసిన ఘనత కచ్చితంగా మన్‌ప్రీత్‌సింగ్‌ సేనదే. విశ్వక్రీడల్లో నాలుగు దశాబ్దాల నిరాశకు టోక్యోలో చుక్కెదురైంది. పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. సెమీస్‌ లో బెల్జియం చేతిలో పరాజయం ఎదురైనా... పతకం ఆశ మిగిలుండటంతో ప్లేఆఫ్‌ లో జర్మనీపై సర్వశక్తులు ఒడ్డి గెలిచిన తీరు అసాధారణం. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌. భారత తురుపుముక్క, దిగ్గజం మేరీకోమ్‌ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. ఒలింపిక్స్‌కు ఆఖరి కసరత్తుగా యూరోప్‌ వెళ్లేందుకు సిద్ధమైన 23 ఏళ్ల లవ్లీనాను కోవిడ్‌ అడ్డుకుంది. కానీ ఆమె టోక్యోలో పతకం గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌ లో విజేందర్, మేరీకోమ్‌ ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది.

రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా కాంస్యంతో మురిపించాడు. గంపెడాశలు పెట్టుకున్న షూటర్లతో పోల్చితే బజరంగ్‌ ముమ్మాటికి నయం. బాల్యం నుంచే కుస్తీ పట్లు పట్టిన ఈ హరియాణా రెజ్లర్‌ టోక్యో వేదికపై కంచు పట్టు పట్టాడు. ఇతన్నీ ఛత్రశాల్‌ స్టేడియమే చాంపియన్‌ రెజ్లర్‌ గా తీర్చిదిద్దింది. అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు నెగ్గిన ఇతని ఖాతాలో తాజాగా ఒలింపిక్‌ పతకం కూడా భర్తీ అయ్యింది. ఇక తదుపరి ఒలింపిక్స్‌ క్రీడలు 2024లో పారిస్‌ లో జరగనున్నాయి.