Begin typing your search above and press return to search.

ఒకే ఓవర్లో 7 సిక్సులు.. మొత్తం 16.. పరుగులు 220.. రుతురాజ్ వీరవిహారం

By:  Tupaki Desk   |   28 Nov 2022 10:32 AM GMT
ఒకే ఓవర్లో 7 సిక్సులు.. మొత్తం 16.. పరుగులు 220.. రుతురాజ్ వీరవిహారం
X
టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టాడని ఇప్పటివరకు చెప్పుకొన్నాం.. అది దేశవాళీల్లో.. మాజీ ఆల్ రౌండర్, డాషింగ్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ 2007 టి20 ప్రపంచ కప్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టడాన్ని చూసి జబ్బలు చరుచుకుంటున్నాం. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ హెర్షలే గిబ్స్ కూడా ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టడంతో ఔరా అనుకున్నాం.. కానీ, ఇకపై ఒకే ఓవర్లో ఏడు సిక్సులు కొట్టిన ఆటగాడి గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది.

ఆ మొనగాడెవరో కాదు.. టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. ఔను రుతురాజ్ అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఏడు సిక్సులు కొట్టాడు. మరెవరికీ దాదాపు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఎక్కడ జరిగింది..? ఎలా జరిగింది..? మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ రంజీల్లో అదే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే సంగతి తెలిసిందే. నిలకడ.. అవసరమైనప్పుడు దూకుడు చూపే గైక్వాడ్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుంటాడు.

తాజాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే లో రుతురాజ్ జట్టు మహారాష్ట్ర.. సోమవారం ఉత్తర ప్రదేశ్ తో తలపడింది.అహ్మదాబాద్ లో జరుగుతున్న ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోనే రుతురాజ్ చెలరేగాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. దీంతో జట్టు ఐదు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.

ఫోర్లు పదే.. సిక్సులు 16 మహారాష్ట్రతో మ్యాచ్ లో రుతురాజ్ మొత్తం 150 బంతుల్లో 220 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఫోర్లు 10 మాత్రమే. సిక్సులు మాత్రం 16 ఉన్నాయి.
అయితే, మహారాష్ట్ర జట్టు ఇన్నింగ్స్ 49 ఓవర్లో అద్భుతం చేశాడు. ఏకంగా ఆ ఓవర్లో 7 సిక్సులు బాదాడు. ఉత్తరప్రదేశ్ బౌలర్ శివ సింగ్ వేసిన ఆ ఓవర్లో ఓ బంతి నోబాల్.
దానినీ రుతురాజ్ సిక్స్ గా మలిచాడు.

ఒకే ఓవర్లో 42 పరుగులు..ఇప్పటివరకు ఒకే ఓవర్లో వచ్చిన అత్యధిక పరుగులు 36. కానీ, ఇప్పుడు రుతురాజ్ 42 పరుగులు చేశాడు. దీంతో ప్రపంచ రికార్డు అతడి పేరుకు మారనుంది. కాగా,
యూపీతో మ్యాచ్ లో రుతురాజ్ కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం ఉంటే ట్రిపుల్ సెంచరీ చేసేవాడేమో.? ఇన్నింగ్స్ లో మొత్తం 300 బంతులకు గాను సరిగ్గా సగం మాత్రమే అతడు ఆడాడు. మిగతా బ్యాట్స్ మెన్ ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేయడంతో జట్టు స్కోరు 330కి పరిమితం అయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.