Begin typing your search above and press return to search.

మోడీ పాలనకి 7 ఏళ్లు.. రైతు ఉద్యమానికి 6 నెలలు.. బ్లాక్ డే !

By:  Tupaki Desk   |   26 May 2021 7:43 AM GMT
మోడీ పాలనకి 7 ఏళ్లు.. రైతు ఉద్యమానికి 6 నెలలు.. బ్లాక్ డే !
X
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలకి వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు నిర్విరామంగా , కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా తమ నిరసనను తెలియజేస్తున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ రైతు ఉద్యమం నేటికీ ఓ కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ రైతు ఉద్యమం ప్రారంభించి నేటికి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. గత ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నవంబర్ 26 తేదీ నుంచి రైతు సంఘాలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అలాగే , మరోవైపు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 7ఏళ్ల పాలనను నేటితో పూర్తి చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇవాళ బ్లాక్ డే నిర్వహించాలని సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్ఛా నిర్ణయించుకున్నాయి కూడా. దీంతో దేశ రాజధానికి నలువైపులా భారీగా పోలీసులు మోహరించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ల ముందు నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల నల్లజెండాల ఎగురవేత కొనసాగింది. బుధవారం బుద్ధ పూర్ణిమ పర్వదినం. సమాజంలో సత్యం, అహింసలు కరవవుతున్నాయి. ఈ ప్రధాన విలువల పునరుద్ధరణ జరిగేలా పండగను జరుపుకోవాలి అని సంయుక్త కిసాన్ మోర్ఛా పిలుపునిచ్చింది. బ్లాక్‌ డే సందర్భంగా రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడాడు. ఉద్యమం చేయబట్టి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలలు దేశ జెండాను మోశాం. మా గళం వినిపించాం. కానీ, ఎవరూ స్పందించలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం మొద్దుగా వ్యవహరిస్తోంది అని టికాయత్ మండిపడ్డాడు. నిరసనల సందర్భంగా ఎక్కడా గుంపులుగా చేరబోమని, బహిరంగ సమావేశాలు అసలే నిర్వహించమని ఆయన తెలిపారు.

రైతు ఉద్యమానికి ఆరు నెలలు, మోదీ పాలనకు ఏడేళ్లు సందర్భంగా రైతులు ఇవాళ బ్లాక్ డే జరుపుతుండటంతో కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఎవరైనా గుంపులుగా మీటింగ్ లు పెట్టినా, అక్రమంగా చెక్ పాయింట్ల నుండి చొరబడేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. మరోవైపు, కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా రైతులు సరిహద్దుల్లో ఆందోళన చేస్తుండడంపై దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు పంపించింది. మే 26న బ్లాక్ డే నిర్వహించాలని వారం క్రితమే ఎస్కేఎం నిర్ణయించింది. ఈ నిరసనలకు తమ మద్ధతు ఉంటుందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈమేరకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక బ్లాక్ డేకు మద్దతుగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలాలో, ఆయన కూతురు రబియా అమృత్ సర్ లో ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు.