Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ ను వణికిస్తున్న క్యూనెట్

By:  Tupaki Desk   |   28 Aug 2019 6:44 AM GMT
టాలీవుడ్‌ ను వణికిస్తున్న క్యూనెట్
X
మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ మోసాలు నిత్యం ప్రజలను దగా చేస్తున్నాయి. ఈ తరహా మోసాలకు ప్రముఖులు ఎండార్స్ చేస్తుండడంతో జనం నిజమేనని నమ్మి పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు.

ఇంట్లో కాలుమీద కాలేసుకుని కూర్చొని లక్షలు సంపాదించొచ్చంటూ ఊరించడంతో క్యూనెట్ సంస్థ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. క్యూనెట్‌కు ప్రమోటర్లుగా వచ్చిన వారిలో బాలీవుడ్‌ నటులు షారుఖ్‌ - అనిల్‌ కపూర్‌ మొదలుకొని బొమన్‌ ఇరానీ - పూజా హెగ్డే ఆఖరికి అల్లు అరవింద్‌ పుత్రుడు అల్లు శిరీష్‌ కూడా ఉన్నారు. నిర్ణీత మొత్తం చెల్లించి ఈ స్కీమ్‌లో చేరి ప్రొడక్టులు కొనడం... వాటిని జనానికి అమ్మడం.. అందులో 20 శాతం లాభం పొందడం దీని రెవెన్యూ మోడల్. ఒకవేళ ప్రొడక్టు నచ్చకుంటే నెలరోజుల్లో వాపస్‌ అంటారు. దానికో యూజర్‌ ఐడీ పాస్వర్డ్‌ ఇస్తారు. వెకేషన్‌ ప్యాకేజీలనీ - ఫారిన్‌ ట్రిప్పులనీ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. స్టార్‌ హోటళ్లలో మీటింగ్‌ పెడతారు. ఇష్టం లేకపోతే నెలలోపు రీ ఫండ్‌ చేస్తామంటారు. కానీ యూజర్‌ ఐడీ - పాస్వర్డ్‌ చేతికివ్వరు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? పెట్టిన డబ్బులు ఎలాగోలా వెనక్కి తీసుకోవాలని డిసైడ్‌ అవుతారు. తనలాగే ఇంకొకరిని ఇరికిస్తారు. ఇలా ఇప్పటిదాకా బాధితులు కొన్ని లక్షల్లో ఉన్నారు. వారిలో చాలామంది సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులే.

క్యూనెట్‌ మోసాలు ఇప్పటివి కాదు. 2001 నుంచి నడుస్తోంది దాని బాగోతం. ముందుగా గోల్డ్‌ క్వెస్ట్‌ పేరుతో మోసాలకు తెరలేపారు. 2008 నుంచి క్యూ నెట్‌ పేరుతో కొత్త అవతారం ఎత్తారు. ఇప్పటిదాకా ఈ సంస్థపై 38 కేసులు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా 70 మందిని అరెస్టు చేశారు. బెంగళూరు ఆఫీసుపై దాడి చేసి రూ.2.7 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని ప్రమోటర్లుగా ఉన్న బాలీవుడ్‌ నటులకు నోటీసులిచ్చారు. వారిలో అనిల్‌ కపూర్‌ - బొమన్‌ ఇరానీ మాత్రమే లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. మిగతావాళ్ల నుంచి ఇంకా సమాధానం రాలేదు. సుమారు రూ. 5వేల కోట్ల మోసం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

క్యూనెట్‌ కేసులో ఇప్పటివరకు 38 కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 70 మందిని అరెస్టు చేశారు. కంపెనీతో సంబంధం లేకుండా నకిలీ డైరెక్టర్లు రూ.కోట్లు వాడుకున్నారని పోలీసులు చెబుతున్నారు. తాజాగా పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారంతో సంబంధాలున్న టాలీవుడ్ ప్రముఖుల గుండెళ్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. రెండేళ్ల కిందట డ్రగ్స్ కేసులతో టాలీవుడ్‌ లో కలవరం మొదలైనట్లే ఇప్పుడు క్యూ నెట్ కూడా టాలీవుడ్‌ ను షేక్ చేస్తోంది.