Begin typing your search above and press return to search.

2019 ప్రధాని ఎవరో తేల్చిన తాజా సర్వే

By:  Tupaki Desk   |   4 Sep 2016 5:52 AM GMT
2019 ప్రధాని ఎవరో తేల్చిన తాజా సర్వే
X
మోడీ అధికారంలోకి వచ్చి 27 నెలలు మాత్రమే అయ్యాయి. ఆయన పదవీ కాలం 60 నెలలు. అంటే.. మోడీ తన పదవీ కాలంలో సగాన్ని కూడా పూర్తి చేయలేదు. ఇదిలా ఉంటే.. మరో మూడేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానిగా ఎవరయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ గ్రాఫ్ ఎలా ఉంది?లాంటి అంశాలతో తాజాగా ఒక సర్వే నిర్వహించారు.

దేశ యువత పేరుతో 2019లో భారత దేశ ప్రధాని అన్న అంశంపై తాజాగా ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధాని మోడీనే మరోసారి ప్రధాని అవుతారని మెజార్టీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ఆన్ లైన్ పోల్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో తర్వాతి ప్రధానిగా మోడీనే సమర్ధుడైన నేతగా అత్యధికులు అభిప్రాయపడటం విశేషంగా చెప్పాలి.

గడిచిన రెండున్నరేళ్లుగా మోడీ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉండటంతో పాటు.. 2019లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని మరోసారి ప్రధానిగా చూడాలన్న ఆలోచనలో 70 శాతం మంది ప్రజలు ఉన్నట్లుగా తాజా సర్వే స్పష్టం చేసింది. ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. తాజాగా నిర్వహించిన సర్వేలో పురుషులతో పాటుమహిళలు కూడా అత్యధికంగా పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది తమ తదుపరి ప్రధానిగా మోడీని ఎన్నుకోవటానికి ఎలాంటి తడబాటుకు గురికామని.. మరో ఆలోచన చేయమని తేల్చి చెప్పేయటం విశేషం.

తాజా సర్వేలో 70 శాతం మంది మోడీని 2019 ప్రదానిగా అంగీకరించటం ఒక ఎత్తు అయితే.. సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది మహిళలు మోడీకి తమ మద్ధతు ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధానిగా మోడీ సక్సెస్ ఫుల్ అన్న భావనతో అత్యధికులు ఉండటంతో పాటు.. తర్వాతి ప్రధానిగా మోడీనే సమర్థుడన్న అభిప్రాయంలో ఉన్నట్లు తేలిందని చెప్పక తప్పదు.