Begin typing your search above and press return to search.

ఓరినాయనో.. ఉల్లిపాయిల్ని దొంగతనం చేసేశారు

By:  Tupaki Desk   |   23 Aug 2015 11:12 AM GMT
ఓరినాయనో.. ఉల్లిపాయిల్ని దొంగతనం చేసేశారు
X
ఆదివారం ఉదయం ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఒక కార్యక్రమం వచ్చింది. అందులో తన కూతురు పెళ్లి కోసం ఓ డబ్బున్న ఆసామి.. ఓ సంబంధం చూస్తాడు. కట్నం గురించి పెద్దగా ఫీలవ్వని పెద్దమనిషి.. పెళ్లి కొడుకు వారు మర్యాదలంటూ ఉదయం టిఫిన్ మొదలు మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం స్నాక్స్.. రాత్రి డిన్నర్ లో ఉల్లిపాయలతో నిండిన ఐటెమ్స్ చెప్పటంతో కంగుతిని.. కావాలంటే మరో పది ఎకరాలు అదనంగా ఇస్తాను కానీ ఉల్లిపాయలతో ఐటెమ్స్ మాత్రం చేయలేనని చేతులెత్తేస్తాడు.

టీవీలో వచ్చిన ఈ సటైర్ చూసినప్పుడు కాస్త ఓవర్ ఉందన్నట్లు అనిపించినా.. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఉదంతం చూసినప్పుడు మాత్రం ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఇంతకాలం దొంగతనం జరిగిందంటే.. బంగారం..వెండి.. లేదంటే విలువైన వస్తువుల కోసం జరగటం చూశాం కానీ.. ఉల్లిపాయల్ని దొంగతనం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది.

ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ.. భారీగా పెరిగిపోయిన ధరతో ఉల్లి కొనాలనుకునే వారి కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయల్ని చోరీ చేయటం ఆశ్చర్యం కలిగించే అంశమే. మండిపోతున్న ఉల్లిపాయ ధరను చూసి ఆశపడ్డారేమో కానీ.. ముంబయి మహానగరంలోని వడాలా ప్రాంతానికి చెందిన ప్రతీక్ష నగర్ లో ఒక వ్యక్తి దుకాణం నుంచి ఉల్లిపాయల్ని బారీగా చోరీ చేశారు.

రాత్రిపూట షాపుకు తాళం వేసుకొని వెళ్లిన ఆయన.. ఉదయం వచ్చి తలుపు తెరిచేసరికి షాపులో ఉండాల్సిన ఉల్లిపాయ స్టాక్ కనిపించకపోవటంతో షాక్ తిన్నాడు. దాదాపు 700 కిలోల ఉల్లి చోరీకి గురైనట్లు చెబుతున్నారు. వీటి విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని చెబుతూ లబోదిబోమంటున్న వ్యాపారిని చూసి ఆశ్చర్యపోవటం పోలీసుల వంతైంది. చివరకు ఉల్లిపాయలు కూడా చోరీ చేసే రోజులు వచ్చేశాయన్న మాట.