Begin typing your search above and press return to search.

దోపిడీలతో అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా ..ఇప్పటివరకు 72 మంది మృతి

By:  Tupaki Desk   |   14 July 2021 4:27 AM GMT
దోపిడీలతో అట్టుడుకుతున్న దక్షిణాఫ్రికా ..ఇప్పటివరకు 72 మంది మృతి
X
నెల్సన్‌ మండేలా కలియదిరిగిన ప్రాంతం నేడు అల్లర్లు, లూటీలతో అట్టుడుకుతోంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు జైలు శిక్ష విధింపుతో మొదలైన దొమ్మీలు ఉద్రిక్తతకు దారి తీశాయి. భద్రతా బలగాలు, స్థానికుల మధ్య ఘర్షణలతో వీధులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలపై దాడి చేస్తున్న స్థానికులు . అందినకాడికి దోచుకుపోతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 72 మంది మరణించారు. ఈ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు రామాఫోసా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు ఆ దేశ సుప్రీంకోర్టు జైలు శిక్ష విధించడంతో ప్రారంభమైన అల్లర్లు తారస్థాయికి చేరాయి.

గత మూడో రోజులుగా జరుగుతున్న అల్లర్లతో దక్షిణాఫ్రికా అట్టుడుకుతోంది. అతిపెద్ద నగరమైన జోహన్నెస్‌ బర్గ్‌ లో మొదలైన అలర్లు.. అత్యధిక జనాభా కలిగిన గౌటెంగ్‌ కు వ్యాపించాయి. జోహన్నెస్‌ బర్గ్‌ లో పేద ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య సముదాయాలు, దుకాణాలపై వేలాది స్థానికులు దోపిడీకి దిగారు. అందినకాడికి దోచుకున్నారు. పోలీసుల బెదిరింపులను బేఖాతరు చేస్తూ.. స్థానికులు దొమ్మికి దిగుతున్నారు. ఆంక్షలను ధిక్కరిస్తూ క్వాజుల్‌, నాటాల్, గౌటెంగ్ ప్రావిన్సులలో పదుల సంఖ్యలో దుకాణాల్లో దోపిడీకి దిగారు. ఈ దోపిడీల నేఫథ్యంలో జోహన్నెస్‌ బర్గ్‌ లోని సంపన్న ప్రాంతాల్లో ఉన్న మాల్స్‌, రిటైల్ కేంద్రాలను మూసివేశారు. వేలాది మంది దుకాణాలపై దాడికి పాల్పడుతుండడం వల్ల వారిని అదుపు చేయలేక పోలీసులు కూడా చూస్తూ ఉండిపోతున్నారు.

దక్షిణాఫ్రికాలో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా నష్ట నివారణ చర్యలకు దిగారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన మూడు రోజులుగా ప్రధాన నగరాల్లో ప్రబలుతున్న హింస, దోపిడిని అరికట్టే ప్రణాళికను ప్రకటించారు. దేశంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు రామాఫోసా సైన్యం సాయాన్ని అర్థించారు. అందుబాటులో ఉన్న వనరులు, సామర్థ్యాలను వినియోగించుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, భద్రతా సిబ్బంది సెలవులను రద్దు చేశారు.

శాంతి, భద్రతల రక్షణకు సైన్యానికి సర్వాధికారాలు అప్పగించినట్లు రామాఫోసా వెల్లడించారు. ఈ అల్లర్లు ప్రజాస్వామ్య చరిత్రలో అరుదుగా కనిపించే హింసగా ఆయన అభివర్ణించారు. హింస, బెదిరింపు, దొంగతనం, దోపిడీ నుంచి దేశంలోని ప్రతి ఒక్కరిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న రామాఫోసా.. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాలో హింసను, దోపిడీని ప్రతిపక్ష పార్టీలు, పౌర సంస్థలు.. ముక్త కంఠంతో ఖండించాయి. అనవసర భయాందోళనలు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశాయి.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా ఈ నిరసన ప్రదర్శనలను 1990 తర్వాత దేశంలో జరిగిన అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పారు.లూటీలు ఇలాగే కొనసాగితే, ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పదార్థాల కొరత ఏర్పడవచ్చని పోలీసు విభాగం మంత్రి భోకి సేలే మంగళవారం మీడియాకు చెప్పారు. అయితే, క్వాజులు-నతల్, గౌతెంగ్ ప్రాంతంలో హింస వల్ల ఇప్పటివరకూ అత్యవసర స్థితి అమలు చేయాల్సిన అవసరం రాలేదని రక్షణ మంత్రి నోజివేవే పిసా కాకులా చెప్పారు. మరోవైపు, తమ ప్రాంతంలో ఇప్పటివరకూ 26 మంది చనిపోయారని క్వాజులు-నతల్ ప్రీమియర్ సిహలే జీకాలాలా చెప్పారు. గౌతెంగ్ ప్రాంతంలో మరో 19 మంది మృతి చెందారు.

ఇక ఇది ఇలా ఉంటే ... 2009 నుంచి 2018 వరకు దాదాపు తొమ్మిదేళ్లపాటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్న జాకబ్‌ జుమాపై అవినీతి ఆరోపణలు అనేకం వచ్చాయి. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దర్యాప్తు కమిషన్‌ ముందు హాజరు కావాలని జుమాను ఆదేశించినప్పటికీ ఆయన దానికి అనుగుణంగా స్పందించలేదు. దీనితో కోర్టు ధిక్కరణ కింద 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఐదారు రోజుల్లో లొంగిపోకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి వచ్చింది. ఒక మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష విధించడం దక్షిణాఫ్రికా దేశ చరిత్రలో ఇదే తొలిసారి.