Begin typing your search above and press return to search.

ఆ దేవుడి 769 బంగారు కుండలు మాయం

By:  Tupaki Desk   |   16 Aug 2016 10:05 AM GMT
ఆ దేవుడి 769 బంగారు కుండలు మాయం
X
దేశంలోనే అత్యధిక సంపన్న దేవుడిగా కేరళలోని శ్రీ పద్మనాభ స్వామికి పేరుంది. తిరువనంతపురంలో కొలువైన ఈ దేవదేవుడి గుడి నేలమాళికలో పెద్ద ఎత్తున బంగారు నగలు రాశులు.. రాశులు ఉండటం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఆ నేల మాళిగలోని ఒక గదిని తెరిచేందుకు అనుమతులు లేని పరిస్థితి. సర్ప బంధనంతో ఉందని చెప్పే ఆ గదిని తెరవ వొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికి ఆ గది తలుపుల్నితెరవని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ దేవుడికి చెందిన ఒక సంచలన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. స్వామివారికి చెందిన అపార సంపదలో 769 బంగారు కుండలు మాయమైనట్లు గుర్తించారు. తాజాగా మాజీ కాగ్ జనరల్ వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు ఇచ్చిన ఒక నివేదికలో ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 2001 జులై వరకూ దాదాపు వెయ్యి బంగారు కుండలు ఉన్నట్లుగా అంచనా వేశారు. కుండల మీద ఉన్న అంకెల ఆధారంగా ఎన్ని కుండలు ఉన్నాయన్న అంచనాతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. 2011 ఏప్రిల్ ఒకటిన 1988 నెంబరు ఉన్న కుండ బయటపడిందని.. దీని ప్రకారం.. అక్కడ బంగారు కుండలు దాదాపు 1988 ఉండాలని.. వీటిల్లో 822 బంగారు కుండల్ని ఆలయ ఆలంకారం కోసం కరిగించగా దాదాపు 1166 బంగారు కుండలు ఉండాల్సి ఉందని పేర్కొన్నారు.

అయితే.. నిపుణుల దృష్టికి 397 కుండలు వచ్చాయని.. మరో 769 కుండల ఆచూకీ మాత్రం లభించటం లేదని ఆయన పేర్కొన్నారు. 2007 ఆగస్టులో ట్రస్టు నిధుల్లోని వస్తువులు అన్నింటికి ఫోటో తీసి ఆల్బమ్ చేయించారని.. ఇప్పుడు ఆ ఆల్బమ్ కూడా కనిపించటం లేదన్న మాట సంచలనంగా మారింది. వేలాది కోట్ల బంగారురాశులు ఉన్న అంచనాల నేపథ్యంలో.. భారీ భద్రత కల్పించాల్సి ఉన్నా.. బలహీనమైన భద్రతతో విలువైన బంగారు కుండలకు కాళ్లు వచ్చినట్లుగా భావిస్తున్నారు. ఈ లెక్కన మరీ తరచి చూస్తే.. ఇంకెన్నింటికి కాళ్లు వచ్చి ఉంటాయో..?