Begin typing your search above and press return to search.

కొవిడ్ నియంత్రణకు 7,900 కోట్ల విరాళం.. దాత ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   30 April 2021 5:30 AM GMT
కొవిడ్ నియంత్రణకు 7,900 కోట్ల విరాళం.. దాత ఎవ‌రో తెలుసా?
X
రూపాయి దానం చేసి వంద రూపాయ‌ల ప్ర‌చారం కోరుకునే బ్యాచ్ ఒక‌టైతే.. వేలు, ల‌క్ష‌ల కోట్లు లాక‌ర్ల‌లో ముర‌గ‌బెట్టుకొని.. పైసా విదిల్చ‌ని బ్యాచ్ మ‌రొక‌టి. ఇలాంటి వారిని నిత్యం మ‌నం చూస్తూనే ఉంటాం. కానీ.. అనిత‌ర‌సాధ్య‌మైన స‌హాయం అందించి కూడా.. తాను ఏమీ చేయ‌లేద‌న్న‌ట్టుగా మ‌న చుట్టూనే తిరుగుతుంటారు మ‌రికొంద‌రు. ఇలాంటి జాబితాలోకే వ‌స్తారు.. విప్రో సంస్థ‌ల అధినేత అజీమ్ ప్రేమ్ జీ!

కొవిడ్ తో దేశం అల్ల‌క‌ల్లోల‌మైపోతున్న స‌మ‌యంలో ఆయ‌న చూపిన ఉదార‌త ఆలస్యంగా వెలుగు చూసింది. అంద‌రినీ నివ్వెర ప‌రుస్తోంది. ప్రేమ్ జీ ఒక‌టీరెండు కాదు.. ఏకంగా 7,904 కోట్ల రూపాయ‌లు విరాళంగా అందించారట‌. ఇప్పుడుకాదు.. గ‌తేడాది ఏప్రిల్ లోనే ఈ మొత్తాన్ని అంద‌జేశార‌ట‌. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ విష‌యం బ‌య‌ట‌కు రాలేదు.

ఇప్పుడు ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందంటే.. ఎడెల్గైవ్ హురున్ ఇండియా అనే సంస్థ దాతృత్వ‌ జాబితా-2020 రూపొందించింది. గ‌తేడాది విరాళాలు అందించిన వారి వివ‌రాలు సేక‌రించి, ప్ర‌చురించ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ జాబితా ప్ర‌కారం.. ఏప్రిల్ 1, 2020 న అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, విప్రో, విప్రో ఎంటర్‌ప్రైజెస్ త‌ర‌పున మొత్తం 7,904 కోట్ల స‌హాయం చేసిన‌ట్టు స‌మాచారం.

ఈ విష‌యం తెలుసుకున్న‌వారంతా అమితాశ్చ‌ర్యం వ్య‌క్తంచేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో విరాళం దేశ చ‌రిత్ర‌లోనే ఎవ్వ‌రూ ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. ప్రేమ్ జీతోపాటు హెచ్‌డిఎల్ టెక్నాలజీస్ చైర్మన్ శివ్ నాదర్ రూ .795 కోట్లు, దేశంలోనే అత్యంత ధ‌న‌వంతుడిగా వెలిగిపోతున్న‌ అంబానీ రూ.458 కోట్లు విరాళంగా ఇచ్చిన‌ట్టు హురున్ జాబితా వెల్ల‌డించింది.

కానీ.. అజీమ్ ప్రేమ్‌జీ అందించిన స‌హాయం మాటల్లో వర్ణించలేనిదని చెబుతున్నారు. అయితే.. ఇంత చేసి కూడా.. ఆయ‌న‌ మీడియాకు ఈ విష‌యాన్ని తెలియ‌నివ్వ‌లేదు. అంతేకాదు.. మ‌రో చోట‌కూడా హంగామా చేసింది లేదు. అదీ.. ప్రేమ్ జీ గొప్ప‌ద‌నం. నిజంగా.. త‌న ప్రేమ‌తో సార్థ‌క‌నామ‌ధేయుడు అనిపించుకున్నాడు.