Begin typing your search above and press return to search.

' ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌ ' మధ్యలోనే తోక్కేసిన అమెరికా !

By:  Tupaki Desk   |   30 Oct 2020 3:50 PM GMT
 ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌  మధ్యలోనే తోక్కేసిన అమెరికా !
X
అమెరికాలో రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్న చైనా ఏజెంట్లను అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అధికారుల ఆదేశాల మేరకు అమెరికాలో నిఘా కార్యక్రమాలు చేస్తున్నట్లు గుర్తించారు. షీ జిన్‌పింగ్‌ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం రహస్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌ లో వీరు భాగమని తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న కొంత మందిని చట్ట విరుద్ధంగా చైనాకు తరలించాలని వాళ్లు చూస్తున్నట్లు తేలింది. తమ దేశం నుంచి పారిపోయిన వారిని ఎక్కడున్నా సరే వెతికి వెనక్కి తీసుకువచ్చేందుకు చైనా చట్టవిరుద్ధమైన ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశం నుంచి అమెరికా పారిపోయి ప్రాణాలు కాపాడు కోవాలనుకుంటున్న వారిని కూడా తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. షీ జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే చైనా ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌ ను చేపట్టింది.

సాధారణంగా నేరగాళ్లను అప్పగించుకోవడానికి ఆయా దేశాలు తాము కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం నడుచుకుంటాయి. ఆ ఒప్పందాల ప్రకారమే నేరస్థుల అప్పగింతలు ఉంటాయి. కానీ, చైనా ఇలాంటి ఒప్పందాలను ఖాతరు చేయకుండా చట్టవిరుద్ధంగా నేరస్థులను తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే , వారిలో ఎక్కువగా షీ జిన్‌పింగ్‌ను, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారే ఉండటం గమనార్హం. అమెరికా ఎఫ్ ‌బీఐ, డిపార్ట్ ‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ అధికారులు ఈ ఫాక్స్‌ హంట్ గుట్టును రట్టు చేశాయి. బుధవారం 8 మంది చైనా ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. చైనా నుంచి పారిపోయిన నేరగాళ్లను పట్టుకునేందుకు షీ జిన్‌‌పింగ్ ప్రభుత్వం 2014లో అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ ను చేపట్టింది. 2015 నాటికి 800 మంది అవినీతి అధికారులను పట్టుకొచ్చినట్లు చైనా అధికారిక మీడియా గొప్పగా ప్రకటించింది.

డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం చైనాను అదుపుచేయడానికి ఈ ‘ఫాక్స్‌హంట్‌’పై దృష్టి పెట్టింది. జులైలో హడ్సన్‌ ఇన్‌ స్టిట్యూట్ ‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎఫ్ ‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ ప్రసంగిస్తూ ఫాక్స్‌ హంట్‌‌ గురించి ప్రస్తావించారు. చట్టాలను చైనా తుంగలో తొక్కుతోందని, ఫాక్స్ హంట్ బాధితులు ఎఫ్ ‌బీఐని ఆశ్రయిస్తున్నారని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ టిబెటన్‌ చైనా ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. సెప్టెంబర్‌లో అతడిపై కేసు పెట్టారు. స్థానికంగా నివాసం ఉంటున్న కొంత మంది చైనీయులపై అతను నిఘా వేసి, ఆ సమాచారం చైనాకు పంపుతున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు.