Begin typing your search above and press return to search.

బీజేపీ గూటికి 8 మంది ఎమ్మెల్యేలు..ఢిల్లీలో ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   18 May 2018 1:33 PM GMT
బీజేపీ గూటికి 8 మంది ఎమ్మెల్యేలు..ఢిల్లీలో ర‌చ్చ‌
X
ఫిరాయింపు రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ రాష్ట్రంలో ఇవి మ‌రింత తారాస్థాయికి చేరాయి. ఒక‌దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా సంచ‌ల‌న ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న క‌న్న‌డ పొలిటిక‌ల్ హీట్‌ లో మ‌రో క‌ల‌కలం చోటుచేసుకునే ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఓ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గోడ‌దూకార‌ట‌. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కు చెందిన ఎమ్మెల్యేలు ఫార్టీ ఫిరాయించేందుకు సిద్ధ‌మయ్యార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు రిప‌బ్లిక్ టీవీ ఓ సంచ‌ల‌న క‌థ‌నాన్ని వెల్ల‌డించింది.

రిప‌బ్లిక్ టీవీ ప్ర‌సారం చేసిన ఈ సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌కారం క‌ర్ణాట‌కు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరారు. బీజేపీకి చెందిన ప‌లువురు ముఖ్య నేత‌ల‌ను వారు క‌లిసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. రేపు జ‌ర‌గ‌బోయే విశ్వ‌సాప‌రీక్ష‌కు వాళ్లు ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ చేరుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా...క‌ర్ణాటక గవర్నర్ వజూభాయ్‌ వాలా - సీఎం యడ్యూరప్పకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన యడ్యూరప్పకు అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు గవర్నర్ వజూభాయ్‌వాలా 15 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు యడ్డీకి షాకిచ్చింది. రేపే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని తీర్పునిచ్చింది. అంతే కాదు బలపరీక్ష ముగిసేవరకు సీఎంగా ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని ఆదేశించింది. ఆంగ్లో ఇండియన్ వర్గానికి చెందిన ఏ వ్యక్తిని ఎమ్మెల్యేగా నియమించరాదని గవర్నర్ వజూభాయ్‌ని అదేశించింది. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంపై స్టే విధించాలని కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ ను విచారించిన సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం కుదరదని, బలపరీక్ష మాత్రం రేపే నిరూపించుకోవాలని, దానికి సంబంధించిన ఏర్పాట్లను చేయాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఎనిమిది ఎంమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.