Begin typing your search above and press return to search.

ఒకే రోజు 8మంది అన్నదాతలు మరణించారు

By:  Tupaki Desk   |   3 Sep 2015 4:34 AM GMT
ఒకే రోజు 8మంది అన్నదాతలు మరణించారు
X
అన్ని చేశాం.. ఇన్ని చేశాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహించనంత అభివృద్ధి చేశామని పాలకులు చెప్పుకొస్తున్నారు. తమ విజయానికి ప్రతీకలుగా విద్యుత్తు సమస్యను పరిష్కరించామని.. పలు అభివృద్ధి పథకాలు చేపట్టామని చెబుతున్నారు. మరి.. ఇన్ని చేసిన సర్కారు.. అన్నదాతల బలవన్మరణాల్ని మాత్రం ఆపలేకపోవటం ఏమిటో అర్థం కాదు. అన్నదాతల బలవన్మరణాల గురించి తెలంగాణ సర్కారు సీరియస్ గా పట్టించుకున్నట్లుగా కనిపించని దుస్థితి.

పంటలు పండకపోవటం.. ప్రకృతి సహకరించకపోవటం.. రుణభారం పెరిగిపోవటం లాంటి సమస్యలున్నా.. తమ కష్టాలకు పరిష్కారం లభిస్తుందన్న భరోసా కానీ ఉండి ఉంటే.. రైతులు తమ ప్రాణాల్ని తీసుకునే పరిస్థితి ఉండేది కాదేమో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 15 నెలలకు ఇప్పటివరకూ మరణించిన అన్నదాతలు ఏకంగా 409 మంది (తెలంగాణ ప్రభుత్వ లెక్క ఇది. వాస్తవ పరిస్థితి ఇంతకంటే ఎక్కువన్న వాదన ఉంది) అంటే.. ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అంటే.. ప్రతి నెల పాతిక మందికి పైనే రైతులు తనువు చాలిస్తున్న పరిస్థితి. అది కూడా ప్రభుత్వ లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటేనన్న విషయం మర్చిపోకూడదు.

రైతుల ఆత్మహత్యలకు గత పాలకుల పాపాలే కారణమని చెబుతున్న తెలంగాణ సర్కారు.. వారు తప్పులు చేయటం కారణంగానే తమకు అధికారం వచ్చిందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? వారే కనుక బాగా చేసి ఉంటే.. టీఆర్ఎస్ కు అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా? రైతుల ఆత్మహత్యల్ని రాజకీయ కోణంలో కాకుండా.. మానవత్వంతో ఆలోచిస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు కారేమో. నిబంధనల ప్రకారం రైతులకు పరిహారం ఇచ్చినట్లు చెప్పి.. తమ బాధ్యత తీరిపోయిందన్నట్లుగా చెప్పటం చూసినప్పుడు.. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది.

తాజాగా ఒక్క బుధవారమే తెలంగాణ వ్యాప్తంగా మరణించిన అన్నదాతలు ఎనిమిది మంది. వీరు కాక గుండెనొప్పితో మరో ఇద్దరు మరణించారు. జిల్లాల వారీగా చూస్తే.. కరీంనగర్ లో ముగ్గురు.. రంగారెడ్డి.. మెదక్. అదిలాబాద్.. ఖమ్మం.. వరంగల్ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరుగా మరణించారు. బతుకు బండి లాగలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతల వెతలపై తెలంగాణ సర్కారు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ఏ మాత్రం తప్పు జరిగినా.. గత ప్రభుత్వాల దుస్థితే తెలంగాణ అధికారపక్షానికి వస్తుందన్న విషయం మర్చిపోకూడదు.