Begin typing your search above and press return to search.

జునాగఢ్ పట్టణంలో సింహాల షికారు

By:  Tupaki Desk   |   13 July 2016 8:22 AM GMT
జునాగఢ్ పట్టణంలో సింహాల షికారు
X
అడవుల్లో ఉండాల్సిన సింహాలు రోడ్డెక్కితే.. అది కూడా, పట్టణంలోని రోడ్లయితే, జనానికి పల్సు పడిపోదూ. గుజరాత్ లోని జునాగఢ్ పట్టణ ప్రజలకు గత రాత్రి అలాంటి అనుభవమే ఎదురైంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సింహాలు జునాగఢ్ పట్టణంలో షికార్లు చేశాయి. వీటిని పలువురు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. సింహాలు దర్జాగా రోడ్డుపై నడిచి వెళుతుంటే, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ సింహాల్లో రెండు కూనలు కూడా ఉన్నాయి.

జునాగఢ్ పట్టణం అమ్రేలీ జిల్లాలో ఉంది. భారతదేశంలో ప్రముఖ సింహాల స్థావరమైన గిర్ అడవులు, అభయారణ్యం ఉన్నది కూడా అమ్రేలీ జిల్లాలోనే. జునాగఢ్లోని శివారు ప్రాంతంలో నిర్మానుష్యమైన చోట ఇలా ఎనిమిది సింహాలు ఒకేసారి కనిపించడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వీటిని సమీపం నుంచి చూసినవారంతా తలో దిక్కు పారిపోగా కొందరు మాత్రం చాటుమాటుగా కెమేరాలు క్లిక్ మనిపించారు. గిర్ అడవుల్లో చాలా సింహాలు ఉండడంతో కొన్ని దారి తప్పి ఇలా జనావాసాల్లోకి వస్తున్నట్లుగా భావిస్తున్నారు.

ఇటీవల కూడా మూడు సింహాలు ఓ గొర్రెల మందపై దాడి చేశాయి. గొర్రెల కాపరిని కూడా గాయపరిచాయి. అంతకు ముందు ఓ మహిళ వీటి దాడిలో మరణించింది. తాజాగా ఎనిమిది సింహాలు తిరుగాడడంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇవన్నీ మార్చి తరువాతే జరిగాయి. గిర్ ప్రాంతంలో ప్రజలను సింహాల నుంచి రక్షించాలని.. వాటిని అడవుల నుంచి బయటకు రాకుండా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.