Begin typing your search above and press return to search.

కేర‌ళ రియ‌ల్ హీరోస్ ఆ 8 మంది కుర్రాళ్లు

By:  Tupaki Desk   |   17 Aug 2018 10:55 AM GMT
కేర‌ళ రియ‌ల్ హీరోస్ ఆ 8 మంది కుర్రాళ్లు
X
దేవుడేం చేస్తాడు? ఏమైనా చేయ‌గ‌ల‌డు. అవ‌స‌ర‌మైతే ప్రాణాల్ని పోకుండా ఆప‌గ‌ల‌డు. కేర‌ళ‌కు చెందిన ఆ ఎనిమిది మంది యువ‌కులు కూడా స‌రిగ్గా అదే ప‌ని చేస్తున్నారు. అందుకే.. ఇప్పుడు వారు దైవ‌దూత‌లుగా అభివ‌ర్ణిస్తున్నారు. సాటి వారికి సాయం చేయ‌ట‌మే ల‌క్ష్యంగా.. ప్రాణాలు పోకుండా ఆపుతూ.. కొత్త జీవితాన్ని అందిస్తున్న ఈ ఎనిమిది మంది కుర్రాళ్లు ఇప్పుడు కేర‌ళ‌కు వ‌రంగా మార‌ట‌మే కాదు.. ప‌లువురికి కొత్త స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఇంత‌కీ వారెవ‌రు? వారేం చేస్తున్నారు? నిన్న మొన్న‌టి వ‌ర‌కూ మామూలు మ‌త్స్య‌కారులుగా ఉన్న‌వారు కాస్తా ఇప్పుడురియ‌ల్ హీరోస్ గా ఎందుకు మారారు? అన్న వివ‌రాల్లోకి వెళితే.. గ‌డిచిన ప‌ది రోజులుగా భారీగా వ‌ర్షాలు విరుచుకుప‌డ‌టం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ 170 మంది ప్రాణాల్ని తీసిన పాడు వాన‌ల పుణ్య‌మా అని కేర‌ళ‌లోని 14 జిల్లాలు జ‌ల దిగ్బంధ‌నంలో కూరుకుపోయాయి.

దీంతో.. కేర‌ళ రాష్ట్రంలో జన జీవ‌నం స్తంభించిపోయింది. కేర‌ళ తాజా ప‌రిణామాల‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు ఇస్తున్నారు. ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ సాయంత్రానికి ప్ర‌ధాని మోడీ సైతం కేర‌ళ‌కు వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించ‌నున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొల్లం సిటీకి చెందిన ఎనిమిది మంది మ‌త్స్య‌కారులు మాత్రం త‌మ ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్నారు. వారికి పున‌ర్జ‌న్మ‌ను ఇస్తున్నారు. ఇందుకోసం పైసా కూడా తీసుకోని వారు.. ప్ర‌మాదంలో ఉన్న వారి ప్రాణాల్ని కాపాడ‌ట‌మే త‌మ క‌ర్తవ్యంగా మారు చెబుతున‌నారు.

కొల్లం నుంచి ప‌థ‌నం థిట్ట ప్రాంతానికి వెళ్లే దారి మొత్తం వ‌ర్షాల కార‌ణంగా కొట్టుకుపోయింది. రోడ్డు ఆన‌వాళ్లు కూడా లేకుండా పోయింది. దీంతో.. ఈ ప్రాంతంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎనిమిది మంది మ‌త్య్స‌కారులు త‌మ ప్రాణాల‌కు తెగించి.. వ‌ర్షాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్నారు. రోడ్ల మీద వెళ్ల‌లేని పరిస్థితి ఎదురైతే.. ప‌డ‌వ‌ల‌ను నీట్లోకి వేసి.. ఈదుకుంటూ బాధితుల్ని కాపాడేందుకు వెళుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ వారు 41 మందిని కాపాడారు. ప్రాణాలు పోకుండా అడ్డుకున్నారు. క‌ష్టంలో ఉన్న వారిని కాపాడ‌టం మా బాధ్య‌త‌.. ఒక మ‌నిషి ప్రాణాన్ని కాపాడితే వ‌చ్చే సంతృప్తికి ఎంత డ‌బ్బు ఇచ్చినా రాదంటున్న వారు.. అందుకే.. త‌మ‌కు డ‌బ్బులు అక్క‌ర్లేద‌ని..క‌ష్టంలో ఉన్న వారికి సాయం చేయ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు. వీరి మాట‌లు మీడియా ద్వారా బ‌య‌ట‌కు రావ‌టంతో ఇప్పుడీ ఎనిమిది మంది మ‌త్య్స‌కారులు రియ‌ల్ హీరోలుగా మారారు.