Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి కరోనా రాకుండా భారత్ తీసుకున్న 8 చర్యలు ఇవే..

By:  Tupaki Desk   |   12 March 2020 6:00 AM GMT
విదేశాల నుంచి కరోనా రాకుండా భారత్ తీసుకున్న 8 చర్యలు ఇవే..
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ 130 కోట్ల మంది ఉన్న భారత్‌లో కనుక వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభిస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అయితే, కరోనా ప్రమాదకరంగా మారుతున్న మొదటి దశలోనే భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకోవడం వల్ల ఈ ప్రాణాంతక అంటువ్యాధి మన దేశంలో పెద్దగా విస్తరించలేదు. ఇప్పటివరకు 60 కేసులు నమోదైనా చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలతో పోల్చితే మనం దాన్ని సమర్థంగా అడ్డుకున్నట్లే చెప్పాలి. ఇప్పుడు మరిన్ని దేశాలకు ఈ వ్యాధి విస్తరించడంతో భారతదేశం మరిన్ని చర్యలు ప్రారంభిచింది. మన దేశంలో విస్తరించడానికి అవకాశం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకోసం ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారిపై కఠిన ఆంక్షలు విధిస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు, ఆదేశాలను జారీ చేసింది.

* ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు (డిప్లొమేటిక్, అఫీషియల్, ఐరాస, అంతర్జాతీయ సంస్థలు, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప) ఏప్రిల్ 15 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 13 నుంచి అమల్లోకి వస్తుంది.

* ఓసీఐ కార్డుదారులకు ఉన్న వీసా-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ఏప్రిల్ 15 వరకు నిలిపేసింది. 13 మార్చి 2020 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

* అత్యవసరంగా భారత్ సందర్శించాలనుకునే ఏ విదేశీయుడైనా తమ సమీప భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి.

* చైనా, ఇటలీ, ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి ఫిబ్రవరి 15 తర్వాత వచ్చిన భారతీయులు లేదా విదేశీయులను 14 రోజుల పాటు క్వారంటైన్ చేస్తారు.

* భారత పౌరులతో సహా భారత్‌కు వచ్చే విదేశీయులు అత్యవసరం కాని తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. అలా ఎవరైనా భారత్‌కు వస్తే వారిని కనీసం 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతారు.

* భారత పౌరులు అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. వారు తిరిగివచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది.

* అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశించడానికి కొన్ని ప్రత్యేక చెక్ పోస్టుల వద్ద మాత్రమే అనుమతిస్తారు. అక్కడ కూడా భారీ స్క్రీనింగ్ ఏర్పాట్లు ఉంటాయి. వీటిని హోంమంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది.

* ఇటలీలో ఉన్న విద్యార్థులు, కారుణ్య కేసులను పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నమూనాల సేకరణ తదనుగుణంగా జరుగుతుంది. ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారు భారత్‌కు తిరిగిరావచ్చు. కానీ వారు కూడా కనీసం 14రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండాలి.