Begin typing your search above and press return to search.

రావెల స‌తీమ‌ణి కొన్న భూమి ఎంతంటే?

By:  Tupaki Desk   |   3 March 2016 9:32 AM GMT
రావెల స‌తీమ‌ణి కొన్న భూమి ఎంతంటే?
X
జ‌గ‌న్ మీడియా సంస్థ చెబుతున్న ఏపీ రాజ‌ధాని భూదందా మాట.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ స‌ర్కారుకు అయితే ఇదో పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. వేలాది ఎక‌రాలు అని చెప్పిన‌ప్ప‌టికీ.. నేత‌ల‌కు సంబంధించి కొంద‌రు బినామీల పేరిట జ‌గ‌న్ మీడియా సంస్థ చూపిస్తున్న ఆధారాలు ఆ స్థాయిలో లేకున్నా.. కొద్దోగొప్పో ఉండ‌టం ఇబ్బందిక‌రంగా మారింది. త్రులు త‌మ స‌న్నిహితుల చేత‌.. త‌మ ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న చిరుద్యోగుల చేత చేయించిన కొనుగోళ్ల‌ను జ‌గ‌న్ మీడియా సంస్థ తెర మీద‌కు తీసుకురావ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాను చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి స‌ద‌రు మంత్రుల‌కు సంబంధించిన వారి ఫోటోల్ని అచ్చేసిన జ‌గ‌న్ మీడియా సంస్థ‌.. చంద్ర‌బాబు బ్యాచ్ కి షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమిటంటే.. భూదందా వ్య‌వ‌హారంలో అటు జ‌గ‌న్ మీడియా సంస్థ‌.. ఇటు మంత్రుల‌కు సంబంధించి వాద‌న‌లు భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

మంత్రి రావెల కిశోర్ బాబు వ్య‌వ‌హారాన్నే తీసుకుంటే.. ఆయ‌న 55 ఎక‌రాలు కొనుగోలు చేశార‌ని జ‌గ‌న్ మీడియా సంస్థ ఆరోపిస్తోంది. బుధ‌వారం ఈ అంకెల్ని చూసిన రావెల తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు కూడా. తాను ద‌ళితుల భూమి కొన్న‌ట్లు చూపిస్తే ఆ భూమిని పేద‌ల‌కు పంచుతాన‌ని ఆయ‌న స‌వాలు విసిరారు కూడా.

బుధ‌వారం అలా మాట్లాడిన రావెల‌.. గురువారం నాటికి మాట‌లోకాస్త మార్పు వ‌చ్చింది. రాజ‌ధాని ప్రాంతంలో త‌న భార్య 83 సెంట్ల అసైన్డ్ ల్యాండ్ కొన్న విష‌యాన్ని విజ‌య‌వాడ‌లో మీడియాకు వెల్ల‌డించ‌టం గ‌మ‌నార్హం. త‌న భార్య 83 సెంట్ల భూమిని కొనుగోలు చేశార‌ని.. ఇంత‌కు మించి ఎలాంటి భూములు కొనుగోలు చేసిన‌ట్లు చూపిస్తే ఎలాంటి విచార‌ణ‌కు అయినా తాను సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు. అసైన్డ్ భూముల్ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కొనుగోలు చేసిన‌ట్లు నిరూపిస్తే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని రావెల ప్ర‌క‌టించారు. బుధ‌వారం నాడు త‌న‌కెలాంటి భూమి లేద‌న్న రావెల‌.. గురువారం నాటికి 83 సెంట్ల విష‌యాన్ని ఒప్పుకోవ‌టం ఏమిటో..? మ‌రి.. రానున్న రోజుల్లో రావెల నోటి నుంచి మ‌రెన్ని విష‌యాలు వ‌స్తాయో..?