Begin typing your search above and press return to search.

రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఆస్తుల లెక్క తేల్చారు

By:  Tupaki Desk   |   22 March 2018 10:02 AM GMT
రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఆస్తుల లెక్క తేల్చారు
X
కొద్దిరోజుల్లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల ఆస్తుల వివ‌రాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. త్వ‌ర‌లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో మొత్తం 63 మంది ఉన్నారు. వీరిలో అత్య‌ధికం కోటీశ్వ‌రులే కావ‌టం గ‌మ‌నార్హం. ఈ విష‌యాన్ని అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫామ్స్ సంస్థ త‌న నివేదిక‌లో పేర్కొంది.

అంతేనా.. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థుల స‌గ‌టు ఆస్తుల విలువ రూ.122 కోట్లుగా తేల్చారు. అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ తో పాటు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ను ఆధారంగా చేసుకొని ఈ వివ‌రాల్ని వెల్ల‌డించారు. తాజాగా బ‌రిలోకి దిగుతున్న అభ్య‌ర్థుల్లో అత్య‌ధిక సంప‌న్న అభ్య‌ర్థిగా జేడీయూకి చెందిన మ‌హేంద్ర ప్ర‌సాద్ గా తేల్చారు. ఆయ‌న ఆస్తులు మొత్తం రూ.4,078 కోట్లు. ఇక‌.. త‌ర్వాతి స్థానం స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టి జ‌యాబ‌చ్చ‌న్. ఆమె ఆస్తులు మొత్తం రూ.1001 కోట్లు కాగా.. జ‌న‌తాద‌ళ్ సెక్యుల‌ర్ పార్టీకి చెందిన బీఎం ఫ‌రూఖ్ ఆస్తులు రూ.766 కోట్లుగా తేలింది.

ఇక‌.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మ‌ను సింఘ్వీకి రూ.649 కోట్ల ఆస్తి ఉంటే.. ఏపీ నుంచి టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో ఉన్న సీఎం ర‌మేశ్ ఆస్తులు రూ.258 కోట్లుగా ప్ర‌క‌టించారు. ఇక ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అత్యంత త‌క్కువ ఆస్తులు ఉన్న వారిలో బిజు జ‌న‌తాద‌ళ్ అభ్య‌ర్థి అచ్యుత్ స‌మంత‌గా నిలిచారు. ఆయ‌న మొత్తం ఆస్తుల విలువ రూ.4 ల‌క్ష‌లు. ఈ అభ్యర్థికి సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి ప్ర‌స్తావించాలి. ఆయ‌న ప్ర‌ముఖ విద్యా సంస్థ అయిన క‌ళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండ‌స్ట్రియాల్ టెక్నాల‌జీ.. క‌ళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ వ్య‌వ‌స్థ‌పాకులు.

అతి త‌క్కువ ఆస్తులున్న అభ్య‌ర్థుల రెండోస్థానంలో స‌మీర్ ఓరాన్ నిలిచారు. ఆయ‌న ఆస్తులు మొత్తం రూ.18ల‌క్ష‌లుగా పేర్కొన్నారు.

రాజ్య‌స‌భ బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల్లోకోటీశ్వ‌రులు అత్య‌ధికులు బీజేపీ నుంచి ఉన్నారు. మొత్తం 26 మంది కోటీశ్వ‌రులుగా లెక్క తేలింది. త‌ర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఆ పార్టీకి చెందిన ప‌ది మంది కోటీశ్వ‌రులు. ఇక‌.. 63 మంది అభ్య‌ర్థుల్లో ఎనిమిది మందిపై కిడ్నాప్.. హ‌త్యాయ‌త్నం.. దొంగ‌త‌నం లాంటి క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లుగా తేల్చారు.