Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 88 మంది కరోనా రోగులు మిస్ అయ్యారా?

By:  Tupaki Desk   |   20 May 2021 5:12 AM GMT
హైదరాబాద్ లో 88 మంది కరోనా రోగులు మిస్ అయ్యారా?
X
ఓ వైపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తుంటే , మరోవైపు కరోనా బాధితులు హాస్పిటల్స్ నుండి మిస్ అవుతోన్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో లో కరోనా రోగులు మాయం కలకలం సృష్టిస్తుంది. కింగ్‌ కోఠి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు పలువురు, డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోతున్నారనే ఓ వార్త ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ప్రచారం అవుతోంది. ఇప్పటివరకు 88 మంది కరోనా బాధితులు ఆస్పత్రి నుంచి మాయం అయినట్టు ప్రచారం అవుతుంది. అయితే ఇదే ఆస్పత్రిలో గతంలో కొందరు కరోనా రోగులు బయటకు వెళ్లి తిరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు కింగ్‌కోఠి ఆసుపత్రిలో కోవిడ్‌ టెస్టుల కోసం వచ్చిన వారి సంఖ్య 14,664. వీరిలో 1,802 మంది అడ్మిట్‌ కాగా 782 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 261 మంది మృత్యువాత పడ్డారు. 671 మంది రోగుల్లో కొందరు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొందరు గాంధీలో, మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. మిగతా 88 మంది చికిత్స పూర్తికాకుండానే అంటే నెగెటివ్‌ రాకముందే కన్పించకుండా పోవడం ఇప్పుడు ఆందోళన కలుగుతోంది. వీరి విషయంలో ఆస్పత్రి అధికారుల వద్ద సరైన వివరాలు లేకపోవడం గమనార్హం. సరైన సెక్యూరిటీ, పర్యవేక్షణ లేని కారణంగానే ఎవరు పడితే వారు లోపలికి రావడం, రోగులు కాస్త కోలుకున్నాక ఎవరికీ చెప్పకుండానే వెళ్లిపోవడం జరుగుతోందనే విమర్శలున్నాయి. అయితే ఈ విషయంలో ఆస్పత్రి అధికారులు మాత్రం సరిగా స్పందించడం లేదు. పేషెంట్లకు ట్యాగ్‌ లు వేయడం, సహాయకులకు పాస్‌లు ఇవ్వడం వంటివి సరిగా అమలు కావడం లేదని తెలుస్తోంది. కొంతమంది ఆస్పత్రిలో అందిస్తున్న ట్రీట్‌మెంట్‌ ఇష్టం లేదని చెప్పి వెళుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.ఈ ఘటన తో ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.