Begin typing your search above and press return to search.

88888 88888.. ముకేశ్ అంబానీ సొంతం కానుందా?

By:  Tupaki Desk   |   16 July 2021 5:32 AM GMT
88888 88888.. ముకేశ్ అంబానీ సొంతం కానుందా?
X
కొత్త వ్యాపార అవకాశాల్ని ఇట్టే కనిపెట్టటం.. భారీగా వాటిని ఏర్పాటు చేయటం..మార్కెట్ లో తనకు మించినోళ్లు మరెవరూ ఉండకూడదన్నట్లుగా వ్యవహరించే ముకేశ్ అంబానీ వ్యాపార ప్రణాళికలు ప్రత్యర్థులకు ఒక పట్టాన అర్థం కావనే చెబుతారు. అలాంటి ముకేశ్ తాజాగా ఒక వ్యాపార సంస్థ మీద కన్నేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు నడుస్తున్నదంతా సమాచార విప్లవమే. ‘డేటా’ చేతిలో ఉంటే చాలు.. కాసులు కురిపించటం ఖాయం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంలో ముకేశ్ అంబానీ తర్వాతే ఎవరైనా అని చెప్పక తప్పదు.

తన డిజిటల్ ఫ్లాట్ ఫాంతో పాటు.. తన ఆన్ లైన్ బిజినెస్ కు పెద్ద ఎత్తున సాయంగా నిలిచే అవకాశం ఉన్న ఒక సంస్థను తన సొంతం చేసుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ‘‘88888 88888’’ నెంబర్లను చూసినంతనే.. జస్ట్ డయల్ గుర్తుకు వస్తుంది. స్థానిక వ్యాపార సంస్థలకు సంబంధించిన సమాచారం దీని ఆయుధం. ఎవరైనా సరే.. ఈ నెంబరుకు ఫోన్ చేసి.. తమ అవసరాల గురించి చెప్పిన క్షణాల్లో.. వారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు భారీ ఎత్తున పంపుతుంటారు.

తాము చేసే వ్యాపారాని జస్ట్ డయల్ ను సొంతం చేసుకోవటం ద్వారా.. దాని డేటా తమకెంతో ఉపయుక్తంగా ఉంటుందని రిలయన్స్ భావిస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. ఆ సంస్థతో ముకేశ్ అంబానీ సంస్థకు చెందిన ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసంరూ.6వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

జస్ట్ డయల్ లో.. ఆ సంస్థ ఎండీ వీఎస్ఎస్ మణికి ఆయన కుటుంబానికి 35.5 శాతం వాటా ఉంది. ముందుగా వీరి వాటాను కొనుగోలు చేసి.. అనంతరం ఓపెన్ ఆఫర్ ద్వారా 26 శాతం వాటాను సొంతం చేసుకోవాలన్న ఆలోచనలో ముకేశ్ ఉన్నట్లు చెబుతున్నారు. అనంతరం ఈ సంస్థలో మణి..జూనియర్ భాగస్వామిగా కొనసాగుతారని చెబుతున్నారు. గతంలో ఈ సంస్థను సొంతం చేసుకోవటానికి టాటా ప్రయత్నించినా ఫలించలేదు. మరి.. ముకేశ్ అంబానీ ఈ డీల్ ను తాను అనుకున్నట్లు క్లోజ్ చేస్తారా? లేదా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.