Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లోకి 8వ కాంగ్రెస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   18 March 2019 6:10 AM GMT
టీఆర్ ఎస్ లోకి 8వ కాంగ్రెస్ ఎమ్మెల్యే
X
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో సంక్షోభం తీవ్రమైంది. ఈ ఆదివారం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార టీఆర్ ఎస్ లో చేరడానికి రెడీ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలైంది. కొత్త గూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ను మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని ఆయన ఫాం హౌస్ లో కలిశారు. అనంతరం తాను టీఆర్ ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.

వనమా వెంకటేశ్వరరావు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన టీఆర్ ఎస్ లో చేరుతున్న 8వ కాంగ్రెస్ ఎమ్మెల్యే కావడం విశేషం. ఈ దెబ్బతో తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 19 సీట్లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 11మంది మాత్రమే మిగిలారు.

ఈ పరిణామం కాంగ్రెస్ ను తీవ్రంగా ఇరుకునపెడుతోంది. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదంలో పడుతుంది. మొత్తం శాసనసభలో 10శాతం మంది అభ్యర్థులు లేకుంటే ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ కు ఆ ప్రమాదం పొంచి ఉంది.

ప్రస్తుతం వస్తున్న సమాచారం మేరకు మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ ఎస్ లో చేరడానికి రెడీ అయిపోయారట.. వారు కూడా టీఆర్ ఎస్ లో చేరితే వారంతా స్పీకర్ కు తాము కాంగ్రెస్ ను టీఆర్ ఎస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటిస్తే సరిపోతుంది. స్పీకర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారాక ఈ నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలున్నాయి. అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇక రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు. వారిని టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలుగానే స్పీకర్ గుర్తిస్తారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలోకి జంప్ అయితే.. వారు శాసనసభా నిబంధనల ప్రకారం పార్టీ మారినందుకు అనర్హత వేటు నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 లోక్ సభ సీట్లను కాంగ్రెస్ కోల్పేయేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత స్పందించారు. తెలంగాణలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే కుట్రను కేసీఆర్ చేస్తున్నారని.. వెంటనే టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ను సోమవారం కలిసి మెమోరాండం సమర్పిస్తామని తెలిపారు.