Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచ ఫార్మాలో 9 మంది కొత్త కుబేరులు .. ఎవరంటే ?

By:  Tupaki Desk   |   21 May 2021 6:37 AM GMT
కరోనా వ్యాక్సిన్ తో  ప్రపంచ ఫార్మాలో 9 మంది కొత్త కుబేరులు .. ఎవరంటే ?
X
ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా కట్టడికి మన దగ్గరున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్లు తయారు చేసే ఫార్మా కంపెనీలు గతంలో ఎన్నడూ చూడనటువంటి లాభాలని చూస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్లు, ఔషధాలకు గిరాకీ భారీగా పెరిగిన నేపథ్యంలో ఆయా కంపెనీల అధినేతల సంపద ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఈ కంపెనీలు ఆర్జిస్తున్న లాభాలే కొత్త కుబేరులు పుట్టుకురావడానికి సహాయం చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్లు తెచ్చి పెట్టిన లాభాలతో తొమ్మిది మంది కొత్తగా బిలియనీర్లుగా మారినట్టు పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్‌ గురువారం వెల్లడించింది.

ఫోర్బ్స్‌ సంపన్నులు జాబితా ప్రకారం వీరి ఉమ్మడి నికర సంపద 19.3 బిలియన్‌ డాలర్లుగా ఉందని తెలిపింది. ఇంత సంపద అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు మరి. వీరి సంపదతో తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వవచ్చని అలయన్స్‌ వెల్లడించింది. కొత్తగా బిలియనీర్లుగా మారిన వారి జాబితాలో మోడెర్నా సీఈఓ స్టీఫెన్‌ బాన్సెల్‌, బయోఎన్‌ టెక్‌ సీఈఓ, సహవ్యవస్థాపకుడు ఉగర్‌ సహిన్‌ ముందు వరుసలో ఉన్నారు. చైనా వ్యాక్సిన్‌ కంపెనీ కాన్‌ సినో బయోలాజిక్స్‌ కు చెందిన ముగ్గురు సహ వ్యవస్థాపకులు కూడా కొత్త బిలియనీర్లలో చోటు సంపాదించుకున్నారు. స్టీఫెన్‌ బాన్సెల్‌ సంపద 4.3 బిలియన్‌ డాలర్లు ఉండగా, ఉగర్‌ సహిన్‌ సంపద 4 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

మోడెర్నా చైర్మన్‌ నౌబర్‌ అఫెయాన్‌ సంపద 1.9 బిలియన్‌ డాలర్లు, మోడెర్నా వ్యవస్థాపక ఇన్వెస్టర్‌, ఇమ్యునాలజిస్ట్‌ తిమోతి స్ర్పింగర్‌ సంపద 2.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది.రొవి చైర్మన్‌ జువాన్‌ లోపెజ్‌ బెల్‌ మోంటే సంపద 1.8 బిలియన్‌ డాలర్లు, మోడెర్నా వ్యవస్థాపక ఇన్వెస్టర్‌, శాస్త్రవేత్త రాబర్ట్‌ లాంగర్‌ సంపద 1.6 బిలియన్‌ డాలర్లు, కాన్‌ సినో బయోలాజిక్స్‌ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ ఝూ టావో సంపద 1.3 బిలియన్‌ డాలర్లు, కాన్‌ సినో బయోలాజిక్స్‌ సహవ్యవస్థాపకుడు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మావో హుయిహువా సంపద 1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక మరో విషయం ఏమిటంటే .. వ్యాక్సిన్ల విడుదల అనంతరం ఇప్పటికే బిలియనీర్లుగా ఉన్న ఎనిమిది మంది సంపద కూడా ఎక్కువగా పెరిగింది. వీరి ఉమ్మడి సంపద 32.2 బిలియన్‌ డాలర్లు పెరిగిందని అలయన్స్‌ వెల్లడించింది.