Begin typing your search above and press return to search.

9 నామినేషన్లు రిజెక్టు.. ఉండేది ఎందరో? వెళ్లేది ఎందరో?

By:  Tupaki Desk   |   12 Oct 2021 4:09 AM GMT
9 నామినేషన్లు రిజెక్టు.. ఉండేది ఎందరో? వెళ్లేది ఎందరో?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటం.. నామినేషన్ల దాఖలు కూడా పూర్తి కావటం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనూహ్యంగా మరణించటం.. మరణించిన ఆయన కుటుంబానికే పార్టీ అధినేత టికెట్ ఇవ్వటంతో.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మొదలు పలు ప్రధాన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. అదే బాటలో పవన్ కల్యాణ్ జనసేన కూడా నడిచింది. ఈ రెండు పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్.. బీజేపీలు మాత్రం తమ అభ్యర్థుల్ని బరిలోకి దించటం ద్వారా.. ఏకగ్రీవం చేయాలన్న ప్రధాన ప్రతిపక్షం చేసిన ఆలోచనకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు.. పలువురు స్వతంత్రులు ఉప పోరులో నిలవటం గమనార్హం. దీంతో.. మొత్తం పాతిక మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు ముగియటం తో పాటు.. నామినేషన్ పత్రాల్ని పరిశీలించే కార్యక్రమం షురూ అయ్యింది.
తాజాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ నేతృత్వంలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. పరిశీలన అనంతరం మొత్తం తొమ్మిది మంది నామినేషన్లను రిజెక్టు చేసినట్లుగా తేల్చారు. దీంతో మొత్తం తొమ్మిది నామినేషన్లను రిజెక్టు చేయటంలో 18 మంది మాత్రమే బరిలో ఉండే పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈ నెల 13న (బుధవారం) వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రిజెక్టు అయిన నామినేషన్లలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థలు కూడా ఉండటం. కాంగ్రెస్ అభ్యర్థి జె. ప్రభాకర్.. బీజేపీ అభ్యర్థి ముది శివక్రిష్ణలతో పాటు.. పెద్దగా పేరు లేని పార్టీలు.. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను రిజెక్టు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసే లోపు మరెందరు బరిలో ఉంటారన్నది ఆసక్తికరంగామారింది. నామ మాత్రంగా మారిన ఈ పోరు ఏకగ్రీవం అవుతుందా? ఆ దిశగా అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.