Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నోట న‌వ‌ర‌త్నాల్లాంటి ప‌థ‌కాలు

By:  Tupaki Desk   |   10 July 2017 4:46 AM GMT
జ‌గ‌న్ నోట న‌వ‌ర‌త్నాల్లాంటి ప‌థ‌కాలు
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ప్లీన‌రీ ఏపీ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త ధీమాను క‌ల్పించింది. ఆరాచ‌క‌పు పాల‌న‌తో గ‌డిచిన మూడేళ్లుగా విసిగి వేసారిన ప్ర‌జ‌ల‌కు స‌రికొత్త ఆశ‌ల్ని క‌ల్పిస్తూ జ‌గ‌న్ ప్ర‌సంగం సాగింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. అధికారంలోకి రావ‌ట‌మే ప‌ర‌మావధిగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా హామీలు ఇచ్చేసిన చంద్రబాబు.. తాను ముఖ్య‌మంత్రిని అయ్యాక ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో తెలిసిందే.

తాను కానీ అధికారంలోకి వ‌స్తే.. ఏమేం చేయ‌గ‌ల‌న‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా వెల్ల‌డించారు జ‌గ‌న్‌. న‌వ‌ర‌త్నాల్లాంటి స‌రికొత్త ప‌థ‌కాల్ని తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. న‌వ్యాంధ్ర‌లో న‌వ వ‌సంతానికి బాట‌లు వేసేలా త‌మ ప‌థ‌కాల అమ‌లు ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్పారు.

కులాల‌కు.. మ‌తాల‌కు.. ప్రాంతాల‌కు.. పార్టీల‌కు అతీతంగా.. అర్హులైన అంద‌రిని ప‌థ‌కాల్లో భాగ‌స్వామ్యం చేయ‌నున్న‌ట్లు విస్ప‌ష్టంగా వెల్ల‌డించారు. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన తొమ్మిది ప‌థ‌కాల‌కు ప్లీన‌రీకి హాజ‌రైన కార్య‌క‌ర్త‌లు.. పార్టీ నేత‌లు పూర్తి సంతృప్తి ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ చెప్పిన తొమ్మిది కీల‌క‌మైన హామీలు ఏమిట‌న్న‌ది చూస్తే..

1. వైఎస్సార్ రైతు భ‌రోసా (ల‌బ్థి పొందే రైతు కుటుంబాలు 66 ల‌క్ష‌లు)

5 ఎక‌రాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50 వేలు ఇస్తాం. ఏటా మేలో నాలుగేళ్ల పాటు రూ.12,500 లను ఇస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి.

2. వైఎస్సార్‌ ఆసరా (ల‌బ్థి పొందే డ్వాక్రా మ‌హిళ‌లు 89 ల‌క్ష‌లు)

ఈ రోజు వరకున్న డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే పూర్తిగా మాఫీ చేసి 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం. అక్షరాలా రూ.15 వేల కోట్లు మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలిస్తాం.

3. పింఛన్ల పెంపు (లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలు)

ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్‌ రూ.1000 నుంచి 2000 పెంచి పక్కాగా అందిస్తాం.

4. అమ్మఒడి (లబ్ధి పొందే విద్యార్థులు 40 లక్షలు)

పేదింటి పిల్లల చదువులకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట్లో ఇద్దరి పిల్లలకు.. 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ. వెయ్యి.. 6 నుంచి 10వ తరగతి దాకా రూ.1500.. ఇంటర్ చ‌దివే వేళ రూ.2వేలు తల్లులకు అందిస్తాం.

5. పేదలందరికీ ఇళ్లు (లబ్ధి పొందే కుటుంబాలు 25 లక్షలు)

పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని మ‌హిళ‌ల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖా పెట్టి పావలావడ్డీకే రుణం ఇచ్చేలా ఏర్పాట్లు.

6. నాటి ఆరోగ్య శ్రీ (లబ్ధి పొందే కుటుంబాలు 1.38 కోట్లు)

ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం. సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బతకడానికి డబ్బులు అందిస్తాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా పింఛన్‌.

7. ఫీజు రీయింబర్స్‌మెంట్ (లబ్ధి పొందే విద్యార్థులు 15.80 లక్షలు)

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20 వేలు అందిస్తాం.

8. జలయజ్ఞం (రైతులంద‌రికీ ప్ర‌యోజ‌న‌మే)

పెండింగ్ ప్రాజెక్టుల్నియుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేస్తాం. సాగునీటి కోసం ఇబ్బంది ప‌డుతున్న రైత‌న్న‌ల‌కు అండ‌గా నిలుస్తాం.

9. దశల వారీగా మద్య నిషేధం (రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనకరమే)

కుటుంబాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వ‌చ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.