Begin typing your search above and press return to search.

90 శాతం మంది ఆదాయం ఆవిరేనా !

By:  Tupaki Desk   |   11 Jun 2020 9:10 AM GMT
90 శాతం మంది ఆదాయం ఆవిరేనా !
X
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్ సంక్షోభం నేపథ్యంలో దాదాపు 80 శాతం భారతీయ ఉద్యోగులు ఆదాయ నష్టాన్ని చవిచూశారని ఒక నివేదిక వెల్లడించింది. ఇక భవిష్యత్‌లో మరిన్ని కోతలకు 90 శాతానికి పైగా సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ బీమా దిగ్గజం జెనరాలీ నివేదికలో తెలిపింది. రాబోయే కొన్ని నెలల్లో సగానికి పైగా ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని స్వయం ఉపాధి పొందుతున్న వారు అంచనా వేస్తున్నారు. వైరస్ విజృంభణ సమయంలో వినియోగదారు సెంటిమెంట్‌లపై 22 దేశాల్లో సంస్థ అధ్యయనం చేసింది.

భారత్ ‌లో ఫ్యూచర్‌ గ్రూప్‌ తో కలిసి జెనరాలీ సంయుక్త సంస్థను నిర్వహిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఎపిఫానీ ద్వారా భారత్‌ లో జెనరాలీ అధ్యయనం చేపట్టింది. వైరస్ కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, భవిష్యత్‌ అనిశ్చితి నేపథ్యంలో కలతచెందుతున్నారు. కుటుంబాలను సంరక్షించుకునేందుకు ఎక్కువ మంది భయపడుతుండగా, ఆర్థిక నష్టాలు ఇందుకు తోడవుతున్నాయి అని తెలిపింది.

భారతీయ ఉద్యోగుల్లో సగం మంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. ఇదే పద్ధతి మరికొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉంది. కార్యాలయంలో ఎంత సమయం పనిచేస్తున్నారో.. ఇంటి నుంచి సైతం అంతే సమయం పనిచేస్తున్నారు అని వెల్లడించింది. ఆదాయం నష్టంతో ఉపశమనం కావాలని 95 శాతం మంది ఉద్యోగులు కోరుకుంటున్నారు. 53 శాతం ప్రభుత్వం నుంచి సాయాన్ని ఆశిస్తున్నారు. 60 శాతం మంది సేవింగ్స్‌, పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇక 39 శాతం మంది కుటుంబ సభ్యుల సాయాన్ని కోరుతున్నారు. మరోవైపు యాజమాన్యాలు ఉపశమనం కల్పించాల్సిందిగా 40 శాతం మంది అభిప్రాయపడ్డారు.