Begin typing your search above and press return to search.

నిలువెత్తు స్ఫూర్తి.. చేతుల్లేకుండా ఫ్లైట్ నడుపుతుంది

By:  Tupaki Desk   |   20 Aug 2020 1:30 AM GMT
నిలువెత్తు స్ఫూర్తి.. చేతుల్లేకుండా ఫ్లైట్ నడుపుతుంది
X
అన్ని ఉన్నా.. ఏదో లేదని దిగులు చెందటం.. వేదనకు గురి కావటం లాంటివి చాలామందిలో చూస్తుంటాం. చిన్న కష్టానికి కిందామీదా పడిపోయేటోళ్లు కొందరైతే.. ఒక మోస్తరు కష్టాలకు విలవిలలాడిపోతుంటారు మరికొందరు. అందుకు భిన్నంగా రెండు చేతులే లేకుండా దేవుడు పుట్టించినా.. దాని గురించి పట్టించుకోకుండా.. ఏకంగా విమానాన్ని నడిపే ఆమెను ఏమనాలి? ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎలా పిలవాలన్న సందేహం పైలెట్ జెస్సికా కాక్స్ ను చూస్తే కలగటం ఖాయం.

ఉన్న లోపాల గురించి అదే పనిగా వేదన చెందకుండా.. వాటిని అధిగమిస్తూ.. ఏదైనా సాధించాలన్న కసి ఉంటే.. అసాధ్యమైనది ఏమీ లేదన్న విషయం అమెరికాకు చెందిన ఈ యువతిని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. 1983లో పుట్టిన ఆమెకు.. జన్మత: రెండు చేతుల్లేకుండా పుట్టారు. అలానే పెరిగి పెద్దదైంది. కానీ.. తనకు లేని చేతుల గురించి ఆలోచిస్తూ.. వేదనతో తనకు తానుగా ఉండిపోలేదు. తనకు సాధ్యమైనది చేద్దామనే తపనతో ప్రయత్నించిన ఆమె.. ఏకంగా ఏవియేషన్ లైసెన్సును పొందటం విశేషం.

ప్రపంచంలో కాళ్లతో విమానాన్ని నడిపే తొలి పైలెట్ జెస్సికాయేనని చెబుతారు. విమానాన్ని మాత్రమేకాదు.. కారును సైతం కాళ్లతోనే ఆమె డ్రైవ్ చేయగలుగుతారు. అంతేనా.. పియానో కూడా వాయించే టాలెంట్ ఆమె సొంతం. అంతేకాదు.. మరిన్ని ఆశ్చర్యపరిచే టాలెంట్లు ఆమె వద్ద పుష్కలంగా ఉన్నాయి.

ఎగిసిపడే అలలకు ఎదురెళ్లి సర్ఫింగ్ చేయటం.. స్కూబా డైవింగ్ తో పాటు.. మార్షల్ ఆర్ట్స్ లోనూ ఆమెకు నైపుణ్యం ఉంది. చేతులు లేవని బాధ పడుతూ కూర్చోకుండా.. తనకున్న అవకాశాల్ని వినియోగించే ప్రయత్నం చేయటంతో ఇప్పుడామె ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చేతులు లేకపోవటం తనకెప్పుడు పెద్ద సమస్యగా ఫీల్ అయినట్లుగా ఆమె మాటలు ఉండకపోవటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.

జెస్సికా గురించి తెలుసుకున్న వారు.. ఆమెను తమ వద్దకు పిలిపించుకొని.. తమ పిల్లలకు స్ఫూర్తి పాఠాలుగా పరిచయం చేస్తుంటారు. ఆమెను చూసినంతనే కొండంత ఆత్మవిశ్వాసం కళ్లముందు కనిపించినట్లుగా ఉంటుంది. గన్నిస్ బుక్ ఆఫ్ వర్డల్స్ లో చేరిన ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎనిమిదేళ్ల క్రితం (2012) పాట్రిక్స్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆరిజోనాలో ఈ జంట నివసిస్తోంది. సవాళ్లకు చికాకు పడిపోవటం.. ఎవరో ఒకరిని నిందించే బదులు.. తమకు తాముగా ప్రయత్నిస్తే చాలన్న విషయాన్ని జెస్సికాను చూస్తే చాలు.. అర్థమవుతుందని చెప్పక తప్పదు.