Begin typing your search above and press return to search.

సీఎంతోపాటు విశాఖకు రానున్న దిగ్గజ ఐటీ కంపెనీ..!

By:  Tupaki Desk   |   16 Feb 2023 6:00 AM GMT
సీఎంతోపాటు  విశాఖకు రానున్న దిగ్గజ ఐటీ కంపెనీ..!
X
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ వికేంద్రీకరణ పేరుతో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే విశాఖ పట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గతంలోనే ప్రకటించారు. అయితే న్యాయపరమైన చిక్కుల కారణంగా విశాఖ రాజధాని ప్రకటన ఆలస్యమవుతోంది.

అనధికారికంగా మాత్రం ఏపీ ప్రభుత్వం విశాఖనే రాజధానిగా భావిస్తోంది. ఈక్రమంలోనే విశాఖకు బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులు ముమ్మరం చేస్తోంది. సీఎం జగన్ క్యాంపు కార్యాలయం సైతం విశాఖ కేంద్రంగా తరలించేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతోంది. ఈ ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా సీఎం కార్యాలయం ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందని ఇప్పటికే పలువురు మంత్రులు సైతం స్పష్టం చేశారు. దేశంలోని పలు దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తొలి దశలో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్పోసిస్ విశాఖ కేంద్రం తన కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమైంది.

ఈ కంపెనీ విశాఖకు రావడానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది మే 31 నుంచి విశాఖ కేంద్రంగా ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను రుషికొండ సిగ్నేచర్ టవర్స్ లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యాలయంలో 650 మంది ఉద్యోగులు ఉంటారని పేర్కొంది. ఉత్తరాంధ్ర.. ఉభయ గోదావరి జిల్లాలోని ఉద్యోగులను వైజాగ్ క్యాంపస్ ప్రాధాన్యత ఇస్తోంది.

విశాఖ కేంద్రంగా ప్రారంభమయ్యే ఇన్పోసిస్ లో వెయ్యి మంది ఉద్యోగులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సైతం గతంలో వెల్లడించారు. ఈ మేరకు కంపెనీకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం సమకూరుస్తున్నట్లు తెలిపారు. కళాశాలల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త ఉద్యోగుల నియామకాన్ని చేపడుతారని పేర్కొన్నారు.

బీచ్‌ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఐబీఎం.. టీసీఎస్.. మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు సైతం విశాఖ పట్టణానికి వస్తాయని చెబుతున్నారు. ఈ కంపెనీలు విశాఖకు వస్తే రాజధాని సెంటిమెంట్ ప్రజల్లోకి బలంగా వెళ్లి తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.