Begin typing your search above and press return to search.

బంగ్లాను ఖాళీ చేయని మాజీ ఐఏఎస్ కు దిమ్మ తిరిగే షాక్

By:  Tupaki Desk   |   16 Jan 2021 2:30 PM GMT
బంగ్లాను ఖాళీ చేయని మాజీ ఐఏఎస్ కు దిమ్మ తిరిగే షాక్
X
అధికారాన్ని అరచేతిలో పెట్టుకొని చెలరేగిపోయేటోళ్లు కొందరు ఉంటారు. పవర్లో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయరా? అని సర్దిచెప్పుకుంటే.. మరికొందరు మాత్రం పవర్ చేతి నుంచి వెళ్లి పోయిన తర్వాత కూడా.. వసతుల్ని వదిలిపెట్టేందుకు ఇష్టపడరు. అలాంటి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి మహారాష్ట్ర సర్కారు దిమ్మ తిరిగే షాకిచ్చింది.

మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి కేపీ బక్షీ రిటైర్ అయ్యారు. అయినప్పటికీ ఆయనకు కేటాయించిన దక్షిణ ముంబయి లోని ప్రభుత్వ క్వార్టర్స్ లోని యశోదా భవనాన్ని ఖాళీ చేయలేదు. 2016 నవంబరు 30న రాష్ట్ర హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. ఆ తర్వాత జలవనరుల విభాగం ఛైర్మన్ గా మూడేళ్ల పదవీ కాలానికి అప్పటి ప్రభుత్వం నియమించింది.

ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఆయన తనకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయలేదు.దీంతో.. ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఎవరైనా ఉద్యోగి రిటైర్ అయినా.. బదిలీ అయినా తొలగించిన మూడు నెలల తర్వాత ప్రభుత్వ క్వార్టర్స్ ను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో వారికి విద్యుత్.. తాగునీరు.. గ్యాస్ సరఫరాను నిలిపివేస్తారు.

చదరపు అడుగుకు రూ.150 చొప్పున ఫైన్ విధించాలని నిర్ణయించారు. మొదటి మూడు నెలలకు నెలకురూ.2395 చొప్పున.. తర్వాత ఐదు నెలలకు నెలకు రూ.2.6లక్షల చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇదిలా ఉంటే తనకు ఎలాంటి నోటీసులు జారీ కాలేదని బక్షీ చెబుతున్నారు. తన జలవనరుల ఛైర్మన్ పదవీకాలాన్ని మరికొంతకాలం పొడిగిస్తారన్న ఉద్దేశంతోనే తాను ఖాళీ చేయలేదని చెబుతున్నారు. అయితే.. ఏదో ఒక సాకు చూపించి ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయని అధికారులపై ఈ తరహా జరిమానాలు విధించాలని నిర్ణయంచినట్లుగా చెబుతున్నారు.