Begin typing your search above and press return to search.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోతు లోయలో పడిన వెహికిల్.. తర్వాతేమైందంటే?

By:  Tupaki Desk   |   23 Sep 2020 6:00 AM GMT
శ్రీశైలం ఘాట్ రోడ్డులో 50 అడుగుల లోతు లోయలో పడిన వెహికిల్.. తర్వాతేమైందంటే?
X
శ్రీశైలం ఘాట్ రోడ్డులో చోటు చేసుకున్న ప్రమాదం ఒకటి ఒళ్లు జలదరింపునకు గురి చేసేలా ఉంది. హైదరాబాద్ లోని ధూల్ పేటకు చెందిన ఒక కుటుంబం క్వాలీస్ వాహనంలో శ్రీశైలానికి బయలుదేరి వెళ్లింది. నాగర్ కర్నూల్ జిల్లా ఈగలపెంట శ్రీశైలం ఘాట్ రోడ్డులో వాహనం అదుపు తప్పి 50 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది.

కొన్ని మీడియా కథనాల ప్రకారం తొమ్మిది మంది ఒకేవాహనంలో వెళ్లారని పేర్కొంటే.. మరికొన్ని మీడియాలలో పదిహేను మంది వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈగలపెంట సమీపంలోని మైసమ్మ గుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపు తప్పిందని.. దీంతో వాహనం యాభై అడుగులు లోతు ఉన్న లోయలో పడింది. వేగంగా పై నుంచి లోయలోకి పడిన ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది.

గాయపడ్డ వారిని మూడు అంబులెన్సుల్లో ఈగలపెంట జెన్ కో ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిలో నలుగురిని ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్ కు తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన వారిని కూడా ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ కు పంపినట్లు చెబుతున్నారు. అతి వేగంతో ప్రమాదం జరిగినట్లుగా చెబుతుంటే.. అదేమీ లేదు.. బ్రేక్ ఫెయిల్ కావటంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

ఏమైనా.. 50 అడుగుల లోతులోకి వాహనం పడిన తర్వాత కూడా ఎవరికి ఏమీ కాకుండా.. స్వల్ప నుంచి ఒక మోస్తరు గాయాలతో బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈగల పెంటకు చెందిన స్థానికులు స్పందించిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసినంతనే.. స్థానికులు అధికార సిబ్బందికి సాయంగా నిలిచారు. దీంతో.. వారందరిని క్షేమంగా పైకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.