Begin typing your search above and press return to search.

ఏపీ బడ్జెట్ లైవ్ : తొలిసారి జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న జగన్ సర్కార్ !

By:  Tupaki Desk   |   20 May 2021 4:34 AM GMT
ఏపీ బడ్జెట్ లైవ్ : తొలిసారి జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న జగన్ సర్కార్ !
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుకాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. ఫిబ్రవరి నుంచి దేశంలో కరోనా రెండో వేవ్ ఉద్ధృతి పెరిగిందని , సెకండ్ వేవ్‌లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్ వర్కర్లకు ఈ సందర్భంగా గవర్నర్ సెల్యూట్ చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్‌ను తెప్పించినట్టు గవర్నర్ వివరించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఏపీ ఆర్థిక పురోగతిని కనబరిచిందని అన్నారు. రాష్ట్రంలో 53.28 లక్షల మందికి ఫస్ట్ డోసు ఇచ్చామని, 21.64 లక్షల మందికి సెకండ్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని గవర్నర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం ఇప్పుడే ముగిసింది.దీనితో, కాసేపట్లో బీఏసీ సమావేశం కాబోతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర 2021-22 బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుండగా, హోంమంత్రి సుచరిత శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ధర్మాన కృష్ణదాస్‌ ప్రవేశపెడతారు.

తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ... అందుకు తగ్గట్టే కేటాయింపులు చేసిన జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ ఏపీ ప్రజల ముందుకు రాబోతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచిన 2021–22 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ ను ఈ రోజు అసెంబ్లీ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా గవర్నర్ మాట్లాడుతూ ... వైఎస్సార్‌ ఆసరా పథకం కింద 87,74,674 మంది మహిళలకు 6792.21 కోట్లు కేటాయించాం. వైఎస్‌ ఆర్‌ సున్నా వడ్డీ కింద 8.78 లక్షల మహిళా సంఘాలకు రూ.1399.79 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కింద 45 నుంచి 60 మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహళలకు 4604.13 కోట్లు కేటాయించాం అని తెలిపారు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తంలో 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారికి కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాల మహిళలకు 5 విడతల్లో రూ.75 వేలు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కోసం 390.74 కోట్లు కేటాయించి నేతన్నలకు 81,783 మంది లబ్ధి చేకుర్చాం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను బీసీలకు వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. జగనన్న విద్యాదీవెన కోసం 4879.30 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.1049 కోట్లు కేటాయించాం. మనబడి-నాడు నేడు కింద 15717 స్కూళ్ల ఆధునికీకరణ చేపట్టాం. స్కూళ్ల ఆధునికీకరణకు రూ.3,948 కోట్లు కేటాయించాం. విద్యాశాఖకు అన్ని పథకాల కింద రూ.25,714 కోట్లు కేటాయించాం. 44.5 లక్షల మంది తల్లులకు జగనన్న అమ్మఒడి వర్తింప చేశాం అని చెప్పారు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95 శాతం హామీలను పూర్తి చేశాం, 2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్‌ ఉండగా ఏపీ 1.58 శాతం అభివృద్ధి రేటు కనకబరిచిందని గవర్నర్ తెలిపారు. ఇక కరోనా మహమ్మారి చికిత్స ను ప్రైవేట్‌ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ కిందకి చేర్చామని అన్నారు. ఇక ఈ ఏడాది బ‌డ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, జల వనరులు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం.. తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నట్లు తెలుస్తోంది. ఇక 2021-2022 ఆర్థిక ఏడాది వార్షిక బ‌డ్జెట్ ప‌రిమాణం రూ. 2.25 కోట్ల నుంచి రూ. 2.30 కోట్ల వ‌ర‌కు ఉండవ‌చ్చ‌ని స‌మాచారం. ఈ కీల‌క బ‌డ్జెట్‌ను మ‌రికాసేప‌ట్లో అసెంబ్లీ ముందుకు రాబోతోంది.

ఇకపోతే , కరోనా కారణంగా ఒక్కరోజుకే ప్రభుత్వం సమావేశాలను పరిమితం చేసింది. గతేడాది రెండు రోజులు నిర్వహించింది. ఏపీ శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తూతూమంత్రంగా ఒక్క రోజు జరిపే అసెంబ్లీ సమావేశాలకు తాము హాజరుకాలేమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 6 నెలలు సమావేశాలు నిర్వహించకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుందన్న ఆందోళనతోనే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత కూడా అయిన అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.