Begin typing your search above and press return to search.

శారదాపీఠంలో సీఎం జగన్ బిజీబిజీ

By:  Tupaki Desk   |   3 Feb 2020 9:00 AM GMT
శారదాపీఠంలో సీఎం జగన్ బిజీబిజీ
X
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శ్రీశారదాపీఠం అంటే వీరభక్తి. కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ శారద పీఠం సందర్శిస్తుంటారు. ఒకసారి కేసీఆర్ ప్రత్యేకంగా శారదాపీఠం సందర్శనకు విశాఖకు వచ్చారు. ప్రత్యేక విమానంలో వచ్చారంటే ఎంత భక్తో ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా శారదాపీఠం అంటే యమభక్తి ప్రదర్శిస్తున్నారు. తాజాగా విశాఖపట్టణంలో ఉన్న శ్రీశారదా పీఠం వార్షికోత్సవాల్లో సోమవారం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని ఆగమ యాగశాలలో ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో సీఎం వైఎస్‌ జగన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం లోక కల్యాణార్థం శారదా పీఠం రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు కూడా. దాదాపు రెండు గంటల పాటు శారదాపీఠంలో జగన్ బిజీబిజీగా గడిపారు. సంప్రదాయ వస్త్రాధారణలో జగన్ మెరిశారు.

పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆధ్వర్యంలో రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు ప్రదక్షిణ చేసిన జగన్ గోమాత కు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానం లో ముద్రించిన తత్త్వమసి గ్రంథాన్ని సీఎం స్వీకరించారు. శ్రౌత మహాసభలో ఉత్తమ పండితుడికి జగన్‌ స్వర్ణకంకణ ధారణ చేశారు. ఈ పర్యటనలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమి రెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజు, టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రశాంతి రెడ్డి, నాదెళ్ల సుబ్బారావు, శేఖర్‌ రెడ్డి తదతరులు ఉన్నారు.

మూడు రాజధానులు గా పేర్కొన్న వాటిలో విశాఖపట్టణం కూడా ఉంది. దీంతో విశాఖకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ ఉత్సవ్ అనంతరం మరోసారి వైజాగ్ లో పర్యటించారు. శారదాపీఠం ఉన్న విశాఖపట్టణం మరో రాజధానిగా ఎంపిక చేయడంలో పీఠం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.