Begin typing your search above and press return to search.

జగన్ మంత్రికి కష్టకాలం.. నియోజకవర్గంలో ఒంటరిగా మారారట

By:  Tupaki Desk   |   6 Feb 2023 7:00 AM GMT
జగన్ మంత్రికి కష్టకాలం.. నియోజకవర్గంలో ఒంటరిగా మారారట
X
ఏపీ పౌర సరఫరాల మంత్రి కారుమూరు నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఒంటరయ్యారట. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన జగన్ కేబినెట్ విస్తరణతో మంత్రి పదవి దక్కించుకున్నారు.

అప్పటి వరకు పౌరసరఫరాల మంత్రిగా ఉన్న కొడాలి నానిని తప్పించి ఆయన స్థానంలో కారుమూరికి ఆ శాఖ కేటాయించారు జగన్. మంత్రి పదవి రావడంతో నియోజకవర్గంలో మరింత పట్టుబిగిస్తారనుకున్న కారుమూరు అందుకు భిన్నంగా క్రమేణా బలహీనపడిపోయారన్నది పార్టీలో టాక్. ముఖ్యంగా మంత్రి అయిన తరువాత నియోజకవర్గంలో ఎక్కువగా ఉండకపోవడం, క్యాడర్‌ను పట్టించుకోకపోవడంతో ఒక్కొక్కరూ జారిపోతున్నారని వినిపిస్తోంది.

2019 ఎన్నికల్లో జగన్ గాలి జోరుగా వీచినా బొటాబొటి మెజారిటీతో గెలిచిన నేతల్లో కారుమూరు కూడా ఒకరు. సుమారు 2000 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు. గెలిచాక నిత్యం ప్రజల్లో ఉంటూ పట్టు పెంచుకున్న ఆయన మంత్రి అయ్యాక మాత్రం ఒక్కాసారిగా ప్రజలకు, క్యాడర్‌కు కూడా దూరమయ్యారని చెప్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవడంతో పనులు చేయించలేకపోవడం, అభివృద్ధి అనేది కనిపించకపోవడంతో జనంలోనూ కారుమూరుపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది.

ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ జోరు పెంచడంతో వైసీపీ క్యాడర్ మెల్లగా టీడీపీ వైపు మళ్లుతోంది. వైసీపీ నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం కంటే తణుకులో టీడీపీ నిర్వహించిన ఇదేం ఖర్మరా బాబూ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగిందని... ఆరిమిల్లి రాధాకృష్ణ ఇప్పటికే ఒక విడత నియోజకవర్గం మొత్తం తిరిగేశారని చెప్తున్నారు.

టీడీపీ కార్యకర్తల ఇళ్లలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెంటనే వాలిపోతున్న రాధాకృష్ణ జోరు ముందు కారుమూరు నాగేశ్వరరావు నిలవలేకపోతున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు. రాధాకృష్ణ సొంత క్యాడర్‌ను కాపాడుకుంటూ వైసీపీ క్యాడర్‌నూ ఆకర్షిస్తున్నారు.

నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలను టీడీపీలో చేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతుండడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు కారుమూరు. అయితే, ఇప్పటికే ఆలస్యమైందని, కారుమూరు పట్టించుకోకపోవడంతోనే టీడీపీలో చేరుతున్నామని కార్యకర్తలు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.