Begin typing your search above and press return to search.

'గడప విడిచి గడప కు'.. స్పీకర్ తమ్మినేని రూటే వేరు

By:  Tupaki Desk   |   28 Jun 2023 6:25 PM GMT
గడప విడిచి గడప కు.. స్పీకర్ తమ్మినేని రూటే వేరు
X
ఏపీ సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కు పదేపదే ఒక మాట చెప్తున్నారు. 'గడప గడప కు మన ప్రభుత్వం' కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, పథకాలు అందకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించి పథకాలు వారికి చేరేలా చూడాలి.. ప్రజల్లో ఎమ్మెల్యేలు తమ గ్రాఫ్ పెంచుకుని ఎన్నికల నాటికి సానుకూలత సాధించాలని చెప్తున్నారు.

అంతేకాదు... గడప గడప కు కార్యక్రమంలో సరిగా పాల్గొనని ఎమ్మెల్యేలు, మంత్రుల ను పిలిచి మరీ క్లాస్ పీకుతున్నారు. వారికి టికెట్లు కూడా ఇవ్వబోనని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఓ 18 మంది ఎమ్మెల్యేల ను హెచ్చరించారంటూ అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది.

సీఎం ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చెప్తున్నా కొందరు సీనియర్ వైసీపీ నేతలు మాత్రం గడప గడప కు కార్యక్రమం విషయంలో నాన్ సీరియస్‌గా ఉంటున్నారు. ఏపీ స్పీకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే ఇంతవరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నది పెద్దగా లేదు.. రీసెంటుగా ఆయనకు కూడా జగన్ నుంచి అక్షింతలు పడడంతో జనం లోకి వెళ్తున్నారు. కానీ.. వైసీపీ కుటుంబాల ఇళ్లకు, తటస్థుల ఇళ్లకు మాత్రమే ఆయన వెళ్తున్నారు.. టీడీపీ క్యాడర్ అని ముద్ర పడిన వారి ఇళ్లకు వెళ్లడం లేదు.

రీసెంటు గా అదే జరిగింది.. తన నియోజకవర్గం లోని ఓ గ్రామంలో 'గడప గడప కు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించిన ఆయన టీడీపీ కి చెందిన మాజీ ఎంపీటీసీ బంధువుల ఇంటిని దాటుకుంటూ వెళ్లిపోయారు. అక్కడ వారు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇంటి బయట నిల్చున్నా పట్టించుకోకుండా ముందుకు సాగి వేరే ఇంటికి వెళ్లారు.

దాంతో తమ్మినేని స్కిప్ చేసిన ఇంటి మహిళ అక్కడికి వెళ్లి ఆయన కు తన సమస్య చెప్పారు.. తనను ఆరు నెలల కిందట అంగన్వాడీ టీచర్ పోస్ట్ నుంచి తప్పించారని, ఎందుకు తప్పించారో చెప్పాలని ప్రశ్నించారు.. దాంతో తమ్మినేని 'నిన్ను తీసేసిన సంగతి నాకు తెలియదనుకున్నావా.. నీ ఇష్టమొచ్చిన దగ్గర చెప్పుకో పో..' అంటూ ఆమె పై ఫైరయ్యారు.

దీంతో తమ్మినేని తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందాలంటే లంచాలు ఇవ్వాల్సి వస్తోందని, లేదంటే పథకాలు రాకుండా చేస్తున్నారని స్పీకర్ నియోజకవర్గం లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌ కు సమస్య చెప్పుకొంటే ఇలాగే బెదిరిస్తారా.. ఆయన మాట్లాడే భాష బాగులేద ని అంటున్నారు.