Begin typing your search above and press return to search.

ఉబర్ డ్రైవర్ తో ఆ నటికి అంతటి భయానక అనుభవం

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:36 AM GMT
ఉబర్ డ్రైవర్ తో ఆ నటికి అంతటి భయానక అనుభవం
X
అనేక టీవీ షోలతో పాటు మరాఠి చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి కమ్ దర్శకురాలు మానవ నాయక్ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆమె అనుభవం గురించి తెలిసినంతనే వణుకు పుట్టటం ఖాయం. ఇంత దారుణంగా వ్యవహరించటమా? అన్న భావన కలుగక మానదు. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు రూపంలో పంచుకోగా.. ముంబయి సంయుక్త పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) విశ్వాస్ నాగ్రే పాటిల్ స్పందించారు. తామీ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకుంటామని.. దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

ఇంతకూ మానవ నాయక్ కు ఎదురైన భయానక అనుభవం ఆమె మాటల్లోనే చదివితే..

'శనివారం రాత్రి 8.15 గంటలు అవుతోంది. నేను బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి మా ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నా. క్యాబ్ ఎక్కిన తర్వాత సదరు డ్రైవర్ ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని కోరా. కానీ.. వినలేదు. బీకేసీ వద్ద సిగ్నల్ జంప్ చేసి ట్రాఫిక్ రూల్ ను ఉల్లంఘించాడు. దీంతో పోలీసులు కారును ఆపి ఫోటో తీసుకున్నారు. ఆ టైంలో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు'

'ఇలాంటి సమయంలో నేను జోక్యం చేసుకున్నాను. ఫోటోను తీసుకున్నారు కదా.. వదిలేయాలని పోలీసులకు చెప్పా. దీంతో వారు వదిలేశారు. దీంతో పోలీసులు వేసిన రూ.500 ఫైన్ మీరు కడతారా? అంటూ డ్రైవర్ నాపైన అరిచాడు. పోలీసులు వేసిన చలానా డబ్బులు ఇవ్వకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో క్యాబ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని కోరా. దీంతో.. అతడు వాహనాన్ని బీకేసీ లోని ఒక చీకటి ప్రాంతంలో ఆపాడు'

'ఆ తర్వాత కారును వేగంగా చునాభట్టి రోడ్.. ప్రియదర్శిని పార్కు దారిలో వెళ్లాడు. దీంతో.. కంప్లైంట్ చేసేందుకు ఉబర్ సేఫ్టీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశా. కాల్ లో ఎగ్జిక్యూటివ్ ఉండగానే ఉబర్ డ్రైవర్ మరోసారి తన కారు వేగాన్ని పెంచాడు. కారు ఆపమని అడిగితే.. ఆపకుండా ఇంకెవరికో ఫోన్ చేయటం మొదలుపెట్టాడు'

'దీంతో భయానికి గురయ్యా. వెంటనే కారు అద్దాలు కిందకు దించేశా. నాకు సాయం చేయాలని కేకలు వేయటం మొదలు పెట్టాడు. రెండు మోటార్ బైకులు.. ఒక ఆటో రిక్షావాలా స్పందించారు. వారు తమ వాహనాన్ని క్యాబ్ కు కార్నర్ చేసి నన్ను రక్షించారు. నేనిప్పుడు సురక్షితంగా ఉన్నాను. కానీ.. భయానికి గురయ్యా' అని పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మెదడు మొద్దుబారిపోయి.. టెన్షన్ కు గురై తప్పులు చేస్తుంటారు. అందుకు భిన్నంగా తనను తాను రక్షించుకోవటం కోసం నటి చేసిన ప్రయత్నాల్ని అభినందించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే తీరులో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.