Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి అమరావతి రైతులు ఇవ్వబోతున్న షాక్‌ ఇదేనా?

By:  Tupaki Desk   |   4 March 2023 1:11 PM GMT
ఏపీ ప్రభుత్వానికి అమరావతి రైతులు ఇవ్వబోతున్న షాక్‌ ఇదేనా?
X
రాజధాని అమరావతి కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం షాకిచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని కేసుల విచారణను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో చెప్పినట్టుగా మార్చి 28నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందన్నారు. దీనిలో రాజ్యాంగ సంబంధిత అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తాము తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా అందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది.

అయితే మార్చి 28 ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30 తేదీల్లో కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని.. కాబట్టి నోటీసులు ఇచ్చిన కేసులను ఈ తేదీల్లో విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. కాబట్టి మార్చి 29, 30తేదీల్లో ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ రెండు రోజుల్లో విచారణ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కు ఈ వ్యవహారాన్ని విన్నవించాలని నిర్ణయించింది. రాజధాని కేసులను త్వరితగతిన విచారిస్తే విశాఖ నుంచి పరిపాలన సాగించాలని జగన్‌ భావిస్తున్నారు. ఇప్పటికే తాను త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని జగన్‌ పలుమార్లు ప్రకటించారు. ఉగాది నుంచి విశాఖ నుంచే జగన్‌ పరిపాలిస్తారని అంటున్నారు.

మరోవైపు అమరావతి రైతులు కూడా తాజాగా న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. రాజధాని కేసులను వెంటనే విచారించడం కుదరదని.. అందులో రాజ్యాంగ సంబంధిత అంశాలతోపాటు ఇతర అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమరావతి రైతులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అమరావతి కేసులను విచారించాలని పిటిషన్‌ దాఖలు చేసే ఉద్దేశంతో ఉన్నారని చెబుతున్నారు. రాజ్యాంగ ధర్మాసనంలో అయితే ఐదుగురు న్యాయమూర్తులు ఉంటారని.. అన్ని రాజ్యాంగ సంబంధిత అంశాలను ధర్మాసనం విచారిస్తుందని రైతులు భావిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాసనం అన్ని విషయాలను పరిశీలించి.. కూలంకషంగా చర్చించి తీర్పు ఇచ్చే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు. అందువల్ల రాజ్యాంగ ధర్మాసనం అమరావతి పిటిషన్లను విచారించాలని కోరనున్నారు.

రాజ్యాంగ ధర్మాసనం రాజధాని అమరావతికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఇక అదే అంతిమ తీర్పు అవుతుందని.. ఇక వైసీపీ ప్రభుత్వం ఇంక ఎక్కడకు వెళ్లడానికి వీలుండదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనానికి రాజధాని పిటిషన్లను అప్పగించాలని పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో మూడు రాజధానులను తెచ్చిన సంగతి తెలిసిందే. శాసన రాజధానిగా అమరావతి, కార్య నిర్వాహక రాజధానికిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి జీవోలను కూడా విడుదల చేశారు. అయితే వీటిని ఏపీ హైకోర్టు కొట్టేసింది. రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. దీంతో జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.