Begin typing your search above and press return to search.

రిటైర్ అయిన హైకోర్టు జడ్జికి అమరావతి మహిళల వినూత్నంగా వీడ్కోలు

By:  Tupaki Desk   |   1 Jan 2021 3:53 AM GMT
రిటైర్ అయిన హైకోర్టు జడ్జికి అమరావతి మహిళల వినూత్నంగా వీడ్కోలు
X
అత్యుత్తమ స్థానాల్లో చాలామంది ఉంటారు. కొందరు మాత్రం ఆ స్థానానికే సరికొత్త గౌరవ మర్యాదల్ని తీసుకొస్తుంటారు. అలాంటి కోవకు చెందిన వారు ఏపీ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిన జస్టిస్ రాకేశ్ కుమార్. గురువారం (డిసెంబరు 31న) ఆయన ఏపీ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వెంటనే తన స్వరాష్ట్రానికి వెళ్లిపోయేందుకు సిద్ధమైన ఆయనకు అమరావతి రైతులు.. మహిళలు వినూత్న రీతిలో వీడ్కోలు పలకటం ఆసక్తికరంగా మారింది.

జస్టిస్ రాకేశ్ కుమార్ వెళుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అమరావతి రైతులు.. మహిళలు.. రోడ్డుకు ఒక పక్కన వరుస క్రమంలో నిలుచొని ఆయనకు చేతులు జోడించి వీడ్కోలు పలికారు. దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర ఈ మానవ హారం ఉండటం గమనార్హం. కొందరు రైతులు.. మహిళలు అయితే.. జస్టిస్ రాకేశ్ ప్రయాణిస్తున్న కారు వెళుతున్న సమయంలో మోకాళ్ల మీద నిలబడి.. చేతులు జోడించి ఆయనకు వీడ్కోలు పలికారు. న్యాయాన్ని కాపాడేలా అమరావతి రైతులకు జస్టిస్ రాకేశ్ కుమార్ మద్దతుగా నిలిచినట్లుగా మహిళలు కొనియాడారు.

నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంగా రాకేశ్ కుమార్ ను పలువురు అభివర్ణిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయన వెలువరించిన తీర్పులు సంచలనంగా మారాయి. 2019 నవంబరు 8న ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీకి రావటానికి ముందు ఆయన బిమార్ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

ఉన్నత న్యాయవ్యవస్థలో కొంత అవినీతి చోటు చేసుకుంటుందని ఆయన చేసిన వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారి పెద్ద చర్చకు తెర తీసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కొలిజియం వరకు వెళ్లాయి. అనంతరం ఆయన ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చారు. ఒక హైకోర్టు న్యాయమూర్తికి ఈ రీతిలో ప్రజలు.. రైతులు పెద్ద ఎత్తున వీడ్కోలు పలకటం చాలా అరుదుగా జరుగుతుందని చెప్పక తప్పదు.