Begin typing your search above and press return to search.

పాపం.. ఏపీ బీజేపీని చూస్తే జాలేస్తోంది గురూ...!

By:  Tupaki Desk   |   28 Aug 2019 2:30 PM GMT
పాపం.. ఏపీ బీజేపీని చూస్తే జాలేస్తోంది గురూ...!
X
పాపం ఏపీ బీజేపీ! ఇప్పుడు రాజ‌కీయ మేధావులు ఇలాంటి వ్యాఖ్య‌లే చేస్తున్నారు. కీల‌క‌మైన నాయ‌కులు తెర‌మ‌రుగు అవుతుండ‌డం -కొత్త దేవుళ్లు - క‌మ్మ దేవుళ్లు తెర‌మీదికి వ‌స్తుండ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని న‌మ్ముకున్న నాయ‌కుల ప‌రిస్థితి కూర‌లో క‌రివేపాకులా.. పులుసులో చింత‌పండు మాదిరిగా మారిపోయింది. దీంతో రాజ‌కీయంగా బీజేపీలో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీని కేంద్రంలోని నాయ‌కులు వెయ్యి క‌ళ్ల‌తో ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల‌నాటికి రాష్ట్రంలో బ‌ల‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో చీటికీ మాటికీ కూడారాష్ట్రంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. మేం అంతిచ్చాం.. ఇంతిచ్చాం.. కాబ‌ట్టి మామాటే నెగ్గాలి! అనే కోణంలోనూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అయితే, వాస్త‌వానికి ఈ విమ‌ర్శ‌లు కొత్త‌వి కాక‌పోయినా.. నాయ‌కులు మాత్ర‌మే మారిపోవ‌డం గ‌మ‌నార్హం.

గతంలో ఇవే వ్యాఖ్య‌ల‌ను ఇక్క‌డి నాయ‌కులు సోము వీర్రాజు - మాణిక్యాల‌రావు వంటి వారు చేసేవారు. దీంతో నిత్యం వీరంతా మీడియాలో ఉంటూ.. వివాదాల్లో త‌ల‌మున‌క‌లై ఉండేవారు. అలాంటి వారు ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. కొత్త నాయ‌కులు తెర‌మీదికి వ‌స్తున్నారు. కొత్త కొత్త ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. త‌మ హ‌వా సాగించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సుజ‌నా చౌద‌రి - పురందేశ్వ‌రి - జీవీఎల్‌ - దేవ్‌ ధ‌ర్ వంటి కీల‌క నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా తెర మీదికి వ‌స్తున్నారు. వీరంతా కూడా ఏపీ రాజ‌కీయాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌తి విష‌యాన్నీ నిశితంగా గ‌మ‌నిస్తున్నారు. ఏ ఒక్క అంశాన్నీ విడిచిపెట్ట‌కుండా ముందుకు సాగుతున్నారు. దీంతో పాత‌త‌రం నాయ‌కులు ఇక తెర‌మ‌రుగ‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద నే ప్ర‌శ్న వ‌స్తోంది.

మ‌రోప‌క్క‌, కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు కూడా కొత్త ర‌క్తాన్ని ప్రోత్స‌హించేందుకు పోటీ ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీ బీజేపీలో పాత‌త‌రం నాయ‌కుల‌కు ఇక ప్రాధ‌న్యం త‌గ్గింద‌నే వాద‌న కూడా వ‌స్తోంది. దీంతో పాపం ఏపీ బీజేపీ! అని అన‌కుండా ఉండ‌లేక పోతున్నారు. ఇదీ సంగ‌తి!