Begin typing your search above and press return to search.

ప్రజల నడ్డి విరిచేందుకేనా చంద్రబాబు టెక్నాలజీ!

By:  Tupaki Desk   |   7 Aug 2017 4:11 AM GMT
ప్రజల నడ్డి విరిచేందుకేనా చంద్రబాబు టెక్నాలజీ!
X
చంద్రబాబు నాయుడు తాను టెక్ కిడ్ నని తరచూ చెప్పుకుంటూ ఉంటారు. టెక్నాలజీ ఉపయోగించే రాజకీయ నాయకుల్లో తనను మించిన వారు లేరని కూడా వక్కాణిస్తుంటారు. కానీ.. చూడబోతే.. ఆయన టెక్నాలజీ ప్రయోగాలు మొత్తం ప్రజల నడ్డి విరించేందుకే తప్ప.. ప్రజలకు శ్రేయస్సు కలిగించడానికి కాదేమోనని ప్రజల్లో భయం కలుగుతోంది. ప్రజల నుంచి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా వారి మీద భారం మోపడానికి సర్కారు తెగిస్తుండడం పలు సందేహాలకు ప్రజల ఆగ్రహానికి కారణం అవుతోంది.

తాజా అంశానికి వస్తే.. పల్లెలు - పంచాయతీల్లో ఇంటి పన్నులను సవరించాలని.. ఏపీ సర్కార్ సర్వే రూపంలో కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా పన్నులను సవరిస్తే.. పంచాయతీల్లో ఇల్లు ఉన్న వారికి భారం భారీగా ఉంటుంది. సమగ్ర సర్వే లాంటి వాటితో ఇప్పటికే లబ్ధిదారుల సమస్త వివరాలను టెక్నాలజీ రూపంలో పొందుపరచిన చంద్రబాబునాయుడు - వాటి ఆధారంగా ఎక్కడ ఎవరెవరికి పథకాలకు కోత పెట్టేస్తాడో అనే భయం పలువురిలో ఉంది. అలాగే నీటి మీటర్ల ఏర్పాటు - ఆధునిక టెక్నాలజీ ద్వారా ఎవరెవరు ఎంత నీళ్లు వాడుకున్నారో లెక్కలు తేల్చి పన్నులు విధించే పద్ధతి తెస్తాం అని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఇళ్ల పన్నుల సవరణను ప్రకటిస్తూ, ప్రతి పంచాయతీలో ఇళ్ల - తదితర సమస్త వివరాలను పంచాయతీ వారీగా ఒక వెబ్ సైట్ ఏర్పాటుచేసి అందులో పొందు పరుస్తారని కూడా అంటున్నారు. అంటే ప్రతి పంచాయతీ జాతకాల్ని వెబ్ సైట్ లలో ఇంటర్నెట్ లో పెట్టేస్తారన్నమాట.

ప్రజల మీద నిఘా పెట్టడం - ప్రజల నడ్డి విరించేందుకు తప్ప.. ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం టెక్నాలజీని వాడుతున్నట్లుగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇంటి పన్నులు వసూలు చేయడానికి ప్రజలు వ్యతిరేకం అనడానికి వీల్లేదు. కానీ.. గతంలో ప్రభుత్వం పన్నుల సవరణకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలోని దాదాపు 28 శాతం పంచాయతీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. రాష్ట్రప్రభుత్వానికి నివేదించాయి. ఆ పంచాయతీల అభ్యంతరాలను పరిగణించి.. పన్నుల విధానంలో ఏం మార్పులు చేశారనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం మళ్లీ వడ్డనలకు సిద్ధమైపోతుండడంపై ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.