Begin typing your search above and press return to search.

దారుణం అంగట్లో అంగన్‌ వాడీ పాల ప్యాకెట్లు

By:  Tupaki Desk   |   12 April 2020 2:10 PM GMT
దారుణం అంగట్లో అంగన్‌ వాడీ పాల ప్యాకెట్లు
X
ప్రభుత్వ రంగంకు చెందిన విజయ డైరీ డబుల్‌ టోన్డ్‌ టెట్రా ప్యాక్‌ ను అంగన్‌ వాడీ కేంద్రాల్లో పిల్లలకు మరియు గర్బిణీ స్త్రీలకు పంపిణీ చేస్తూ ఉంటారు. ఆ ప్యాకెట్లపై అంగన్‌ వాడీ కేంద్రాలకు మాత్రమే పంపిణీ చేయాలని.. వీటిని అమ్మేందుకు అనుమతి లేదు అంటూ ముద్రించి ఉంటుంది. కాని అంగన్‌ వాడీ కేంద్రాలకు వెళ్లవల్సిన పాలు సూపర్‌ మార్కెట్‌ లో అమ్ముడవుతూ ఉన్నాయనే ఆరోపణలు మొదటి నుండే ఉన్నాయి. తాజాగా అంగన్‌ వాడీ పాల పాకెట్‌ ఏకంగా సూపర్‌ మార్కెట్‌ లో కనపడటం చర్చనీయాంశం అయ్యింది.

సికింద్రాబాద్‌ పీజీ రోడ్డులో ఉండే ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ రత్నదీప్‌ కు గిరిధర్‌ గోపాల్‌ అనే వ్యక్తి పాలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అక్కడ విజయ డైరీ డబుల్‌ టోన్డ్‌ టెట్రా ప్యాక్‌ ను చూసి స్టోర్‌ మేనేజర్‌ ను సంప్రదించాడు. ప్రభుత్వం అంగన్‌ వాడీలకు సరఫరా చేసే పాల ప్యాకెట్‌ లు మీ స్టోర్‌ లో ఎలా అమ్ముతున్నారంటూ ప్రశ్నించాడు. అందుకు మేనేజర్‌ స్పందిస్తూ తమకు గోడౌన్ల నుండి వచ్చినవి అమ్ముతామని చెప్పుకొచ్చాడు.

ఈ విషయమై గోపాల్‌ రాంగోపాల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌ లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ పాల ప్యాకెట్‌ సూపర్‌ మార్కెట్‌ కు ఎవరి ద్వారా వచ్చింది.. అది ఏ అంగన్‌ వాడీ కేంద్రంకు సరఫరా చేసినదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.