Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కుమార్తె కవితపై సుఖేష్‌ మరో బాంబు!

By:  Tupaki Desk   |   24 May 2023 4:24 PM GMT
కేసీఆర్‌ కుమార్తె కవితపై సుఖేష్‌ మరో బాంబు!
X
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే మనీలాండరింగ్‌ వ్యవహారంలో అరెస్టయి సుఖేష్‌ చంద్రశేఖర్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు తాజాగా మరో లేఖను విడుదల చేశాడు. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పై సైతం సంచలన ఆరోపణలు చేశాడు.

కేజ్రీవాల్‌ ఇంటి నిర్మాణంపై సుఖేశ్‌ చంద్రశేఖర్‌ ఈ లేఖలో మరోసారి కీలక ఆరోపణలు చేశాడు. ఆ ఇంటి ఫర్నీచర్‌ కి అయిన ఖర్చులను తానే భరించానని తెలిపాడు. అందుకు సంబంధించిన బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని వెల్లడించాడు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత షెల్‌ కంపెనీల ఖాతాల నుంచి మారిషస్‌ లోని కైలాష్‌ గెహ్లాట్‌ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయ్యిందని ఆ లేఖలో సుఖేష్‌ ఆరోపించాడు. 25+25+30 కోట్ల చొప్పున నగదు బదిలీలు జరిగాయని పేర్కొన్నాడు.

ఈ మనీ లాండరింగ్‌ కు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఫేస్‌ టైం చాట్స్‌ వివరాలను కూడా తాను త్వరలోనే విడుదల చేస్తానని సుఖేశ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించాడు. తాను వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని అతడు లేఖలో వాపోయాడు. వారికి అనుకూలమైన జైలు అధికారుల ద్వారా తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించాడు.

తనను వేధిస్తున్న పోలీసు అధికారులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానని సుఖేష్‌ చంద్రశేఖర్‌ తెలిపాడు. త్వరలోనే ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కు సంబంధించి మరో కుంభకోణాన్ని బయట పెడతానని వెల్లడించాడు.

కాగా గతంలో కూడా సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్, ఆప్‌ నేత సత్యేంద్ర జైన్‌ సూచనలతోనే తాను హైదరాబాద్‌ లోని బీఆర్‌ఎస్‌ ఆఫీసులో ఆ పార్టీ నేతకు రూ.15 కోట్లు ఇచ్చానని ఆ లేఖలో ఆరోపించాడు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌ లీడర్‌ తో జరిగిన వాట్సాప్‌ చాట్‌ ను కూడా లేఖలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాను నార్కో టెస్ట్‌కు సిద్ధమని సుఖేష్‌ మార్చిలో విడుదల చేసిన లేఖలో ప్రకటించాడు. ఇది టీజరేనని ..అసలైన బ్లాక్‌ బస్టర్‌ ముందుందని కేజ్రీవాల్‌ ను సుఖేష్‌ చంద్రశేఖర్‌ అప్పుడే హెచ్చరించాడు.

అన్నట్టుగానే ఇప్పుడు మరో లేఖ విడుదల చేసిన కేసీఆర్‌ కుమార్తె కవిత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పై సంచలన ఆరోపణలు చేశాడు.