Begin typing your search above and press return to search.

పోలీసుల జేబుల్లో బ్లేడ్లు..నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   12 Jan 2020 3:48 AM GMT
పోలీసుల జేబుల్లో బ్లేడ్లు..నిర్మాత అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు
X
ఏపీలో అమరావతినే రాజధానిగా ఉండాలంటూ అక్కడి గ్రామాల్లో సాగుతున్న నిరసనలు.. ఆందోళనలు భారీగా సాగుతున్న వేళ.. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అక్కడ పర్యటించారు. రాజధాని రైతులను కలుసుకున్నారు. పలు గ్రామాల్లో ఆందోళన జరుగుతున్న వేళ.. పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పు పట్టమే కాదు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని ప్రాంతంలో అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడే పరిస్థితి ఉందన్న ఆయన.. మహిళల విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పు పట్టారు. గుడికి వెళ్లే మహిళల్ని వెంబడించి మరీ తలలు పగలకొడుతున్నారని.. పలువురిని ఏ కులమని ప్రశ్నిస్తూ వారిపై దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు.

ఇటుకలు పట్టుకొని ప్రజల వెనుకాల పోలీసులు పరిగెడుతున్నారని.. ఇలాంటివి ఎప్పుడైనా.. ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. పోలీసుల జేబుల్లో బ్లేడ్లు ఉన్నాయని.. అసలు వీరంతా నిజమైన పోలీసులేనా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేవారు. రైతుల చేతులపై బ్లేడ్ల గాయాల్ని చూస్తుంటే తన నోట వెంట మాట రావటం లేదని.. అసలు మనం భారతదేశంలోనే ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందన్నారు.

రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సమయంలో నాడు జగన్ సైతం ఆమోదం తెలిపారని.. ఇప్పుడు మాట మార్చటం ఏమిటన్న ప్రశ్నను సంధించారు. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని.. పునాదులు నిలవడవని వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. మంత్రి బొత్స ఏం మాట్లాడుతున్నారో తెలీకుండా మాట్లాడుతున్నట్లుగా పేర్కొన్నారు.

రైతులు చేస్తున్న పోరటానికి సంఘీభావం తెలియజేయటానికి తన భార్య రాజధాని ప్రాంతానికి వస్తానని చెప్పిందని.. కానీ ఇక్కడి పరిస్థితులు చూసిన తర్వాత నువ్వు కానీ ఇక్కడికి వస్తే వెనక్కి రావని తాను ఆమెకు సలహా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు.