Begin typing your search above and press return to search.

15 రోజుల్లో 9వేల సమావేశాలు.. తెలంగాణలో బీజేపీ భారీ ప్లాన్

By:  Tupaki Desk   |   22 Jan 2023 10:30 AM GMT
15 రోజుల్లో 9వేల సమావేశాలు.. తెలంగాణలో బీజేపీ భారీ ప్లాన్
X
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే పార్టీకి ఆదరణ పెరుగుతుండడంతో దానిని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే అని చాటి చెబుతున్న నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ ఓటర్ కు కమలం గుర్తు కనిపించేలా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాయకులను నియమించనున్నారు. ‘సరళ్’ యాప్ తో రాష్ట్రస్థాయి నేతలు ప్రతీ కార్యకర్తతో టచ్ లో ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అప్డేట్ ఇస్తున్నారు. అయితే బహిరంగ సభలు నిర్వహించడం కంటే గల్లీ సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే మొత్తం 15 రోజుల్లో 9 వేల సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రతీరోజు 60 చిన్న సభలు ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఉన్న తక్కువ సమయంలో ప్రజలను ఆకర్షించుకోవాలి. అందువల్ల ప్రజలను ఆకట్టుకోవడానికి పాత పద్దతుల్లో కాకుండా కొత్త విధానంలో ముందుకు వెళ్తున్నారు బీజేపీ నాయకులు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పటికే ‘సరళ్’ యాప్ ద్వారా కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక త్వరంలో చిన్న సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. బహిరంగ సభలు అధిక ఖర్చు, శ్రమతో కూడుకున్నందున గల్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సమావేశాల ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో తెలంగాణకు చెందిన నేతలే పాల్గొంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు ప్రాధాన్యత కలిగిన వాటిలో పాల్గొంటారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీజేపీ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలున్నాయి. కానీ హైదరాబాద్ ను బీజేపీ 6 జిల్లాలుగా విభజించింది. ప్రతీ జిల్లాకు ముఖ్య నాయకుడిని నియమించి ఈ కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా చూస్తారు.

15 రోజులపాటు ప్రతిరోజూ 60 సమావేశాలు నిర్వహించేలా ప్లాన్ చేస్తారు. ఇందుకోసం స్థానిక నాయకులు ప్రజలను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం ఇప్పటికే ముద్రించి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తారు. వాటి ద్వారా ప్రజలను సమావేశాలకు తీసుకురానున్నారు. కార్యకర్త నుంచి రాష్ట్ర నేతల వరకు పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని ఢిల్లీ పెద్దలు సైతం సూచించారు.