Begin typing your search above and press return to search.

వడ్డీ లేని అప్పు ఇస్తామంటే.. భారీ వడ్డీలకు రుణాల్ని తెస్తున్నారా?

By:  Tupaki Desk   |   27 Jun 2023 9:17 AM GMT
వడ్డీ లేని అప్పు ఇస్తామంటే.. భారీ వడ్డీలకు రుణాల్ని తెస్తున్నారా?
X
మొన్నటివరకు మాట్లాడకుండా ఉండిపోయిన బీజేపీ నేతలు.. హటాత్తుగా గాఢనిద్ర నుంచి ఉలిక్కిపడి లేచినట్లుగా వ్యవహరిస్తున్నారు ఏపీ అధికారపక్షం విషయంలో. కోరుకున్నంతనే ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు అదే పనిగా అపాయింట్ మెంట్లు ఇవ్వటం తెలిసిందే.తాను భేటీ అయిన ప్రతిసారీ రాష్ట్ర సమస్యల మీదన మాట్లాడినట్లుగా జగన్ అండ్ కో చెప్పుకోవటం తెలిసిందే.

మరింతకాలం మౌనంగా ఉన్న ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రభుత్వం మీద ఇంతకాలం చేసిన విమర్శలు.. ఆరోపణలకు భిన్నంగా ఆయన కొత్త తరహా దోపిడీ గురించి చెప్పి షాకిచ్చారు. యాభై ఏళ్ల కాలపరిమితితో రాష్ట్రాలకు కేంద్రం వడ్డీ లేని రుణాల్ని ఇస్తుందని.. ఈ పథకం కింద ఏపీకి రూ.5 వేల కోట్లు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే వీలుందని పేర్కొన్నారు.

వడ్డీ లేని రుణాలను కావాలని దేశంలోని పదహారు రాష్ట్రాలు కావాలని కోరుతుంటే.. జగన్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా మొద్దునిద్ర పోతుందని.. వడ్డీ లేకుండా అప్పు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? అంటూ ప్రశ్నించారు.

కేంద్రం వడ్డీ లేని అప్పు ఇస్తామంటే అందుకు ఆసక్తి చూపని జగన్ సర్కారు.. అందుకు భిన్నంగా భారీ వడ్డీలకు అప్పు తేవటం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు.

సత్యకుమార్ మాటలన్నీబాగానే ఉన్నా.. నాలుగేళ్లుగా జగన్ పాలన మీద ఏం చేస్తున్నట్లు? అన్నది ఒక ప్రశ్న. రాష్ట్ర సమస్యల గురించి తన వేదనను చెప్పుకోవటానికి తరచూ తమతో భేటీ అయ్యే సీఎం జగన్మోహన్ రెడ్డికి భారీ వడ్డీకి రుణాల్ని ఎందుకు తెస్తున్నట్లు? లాంటి విషయాల్ని మోడీషాలు ఎందుకు ప్రశ్నించలేదన్నది ప్రశ్న.

కేంద్రం పెద్దన్నలా వ్యవహరిస్తున్నప్పుడు.. జగన్ సర్కారు నిర్ణయాల గురించి ఎందుకు హెచ్చరించలేదు? అన్నది ప్రశ్న. తప్పు జరుగుతున్నంతసేపు కళ్లప్పగించినట్లుగా ఉండిపోయి.. ఇప్పుడు మాత్రం అదే పనిగా ప్రశ్నలు వేయటంలో ఏమైనా అర్థం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.