Begin typing your search above and press return to search.

మునుగోడు ట్రైల‌రే.. కేసీఆర్‌కు అస‌లు సినిమా చూపిస్తాం: బీజేపీ హాట్ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   30 Oct 2022 3:44 AM GMT
మునుగోడు ట్రైల‌రే.. కేసీఆర్‌కు అస‌లు సినిమా చూపిస్తాం:  బీజేపీ హాట్ కామెంట్స్‌
X
మునుగోడు ఉప ఎన్నిక కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని.. సీఎం కేసీఆర్‌కు అసలు సినిమా ముందుముందు చూపిస్తామ‌ని బీజేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. కట్టుకథలు అల్లుతూ టీఆర్ ఎస్ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌ చుగ్ అన్నారు. ఎమ్మెల్యేల‌కు ముడుపుల వ్య‌వ‌హారంపై టీఆర్ ఎస్‌ ఆరోపణలపై బండి సంజయ్ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారని.. ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు కేసీఆర్‌ ఎందుకు రాలేదని తరుణ్‌ చుగ్‌ ప్రశ్నించారు.

బంగారు తెలంగాణ చేయాలనేది మోడీ కల అని తరుణ్‌ చుగ్‌ పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్‌ నాటకాలను గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక ఒక ట్రైలర్‌ మాత్రమేనని ముందు ముందు కేసీఆర్‌కు, ఆయ‌న కుటుంబానికి ఫుల్ లెంగ్త్ సినిమా చూపిస్తామ‌ని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ అభ్యర్థి నైతికంగా ఓడిపోయారని వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఉప ఎన్నికల్లో నిమగ్నం చేశారని విమర్శించారు. డబ్బులతో నేతలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

మునుగోడు ప్రజలు వివేకవంతులని.. ఈ విషయం గమనించాలని తరుణ్‌చుగ్‌ కోరారు. ఎనిమిదేళ్ల టీఆర్ ఎస్‌ పాలన గురించి శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు ఎందరికి వచ్చాయో తెలపాలని నిలదీశారు. టీఆర్ ఎస్ నేతల నిజరూపం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. యాదాద్రి ఆలయంలో బండి సంజయ్‌ ప్రమాణం చేశారని.. ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు కేసీఆర్‌ ఎందుకు రాలేదని తరుణ్‌ చుగ్‌ ప్రశ్నించారు.

అవినీతికి కల్వకుంట్ల కుటుంబం కేరాఫ్ అడ్రస్ అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ కు వ్యతిరేకంగా మునుగోడు తీర్పు రాబోతోందన్నారు. కేసీఆర్ సినిమా స్టోరీలు రాస్తారని విమర్శించారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పక్కన ఉండేందుకు.. స్వంత పార్టీ నేతలే సిగ్గుపడుతున్నారని తెలిపారు. ఫామ్‌హౌస్ వ్యవహారమంతా ఓ నాటకమని ఆయన కొట్టిపారేశారు. ఈ వ్యవహారమంతా నకిలీదేనని తోచిపుచ్చారు. ఫిరాయింపుదారులంతా టీఆర్ఎస్‌లోనే ఉన్నారని తప్పుబట్టారు.