Begin typing your search above and press return to search.

భ్రమలలో కమలం : సినీ గ్లామర్ తో ఓల్డ్ పాలిటిక్స్...?

By:  Tupaki Desk   |   28 Aug 2022 7:42 AM GMT
భ్రమలలో కమలం : సినీ గ్లామర్ తో ఓల్డ్ పాలిటిక్స్...?
X
వెండి తెర మీద చేసే విన్యాసం భలే పసందుగా ఉంటుంది. తెర మీద నాయకుడు ఒకేసారి వందలాది మందిని కొట్టారంటే జనాలు తమాషాగా చూస్తారు. అదే రియల్ లైఫ్ లో ఎవరినీ ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే సినిమా అన్నది జస్ట్ వినోదం మాత్రమే. అయితే రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి తేడా తెలియని అమాయకపు రోజులు గతంలో ఉండేవి. అందుకే సినిమాలో దేవుడు పాత్ర వేస్తే వారే నిజమైన దేవుళ్ళు అని భ్రమపడేవారు. అలాగే హీరో అక్కడ ఒక్క దెబ్బకు పేదల‌ కష్టాలు తీరిస్తే తమకూ అలా చేస్తారని నమ్మారు.

ఇక వెండి తెర నటులు రాజకీయాలను శాసించిన సందర్భాలు అర్ధ శతాబ్దం నాటి ముచ్చట. అంటే అపుడు కేవలం సినిమా మాత్రమే వినోదంగా ఉండే కాలం. ఆ టైమ్ లోనే ఒక ఎమ్జీయార్, ఎన్టీయార్, జయలలిత ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వారు ప్రజా నాయకులుగా కూడా కీర్తిని గడించారు. అయితే 1990 దశకం తరువాత వెండితెర వన్నెలు క్రమంగా తగ్గడం మొదలెట్టాయి. షూటింగ్ అంటే ఏమిటో జనాలకు తెలిసింది. తెర వెనక జరిగేవి అన్నీ కూడా వారికి పూర్తిగా అర్ధమైపోయాయి.

అంతే కాదు సినిమా అన్నది జస్ట్ వినోదం అని కూడా బాగా తెలిసిపోయింది. ఇక సామాజిక మాధ్యమాల విస్తృతి బాగా పెరిగిన కాలంలో సినిమా నటులను కూడా కేవలం రీల్ లైఫ్ వరకే ఆదరిస్తున్నారు. రియల్ లైఫ్ లో తమకు నచ్చిన రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే ఎన్టీయార్ తరువాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనను సినిమాల్లో కొలిచిన వారు రాజకీయాల్లో మాత్రం ఎందుకో ఒప్పుకోలేదు.

అదే తీరున విశ్వనటుడిగా పేరు గడించిన కమల్ హాసన్ 2021 ఎన్నికల్లో తమిళనాట పార్టీ పెట్టి అన్ని సీట్లకు పోటీ చేస్తే తాను పోటీ చేసిన దాంట్లో కూడా ఓడారు. ఇక తెలుగు నాట జనసేన పార్టీని పెట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన తానుగా రెండు చోట్ల ఓడారు. పార్టీకి ఒక్క సీటు దక్కింది. వీరే కాదు చాలా మంది సినిమా తారలు సొంతంగా పోటీ చేసినా వారిని జనాలు ఓడించారు.

ఇక్కడ రాజకీయం వేరు సినిమా వేరు అన్నది సామాన్య ఓటరు కూడా గుర్తిస్తున్నాడు. అందుకే సినిమా గ్లామర్ అనేది థియేటర్లను దాటి బయటకు రావడం లేదు. ఇక ఫ్యాన్స్ అన్న వారు కూడా సినిమాల వరకే అని చెబుతున్నారు. రాజకీయాల్లో మాత్రం తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకుంటున్నారు. సినిమా హీరోయిన్ల విషయంలో కూడా ఇదే జరుగుతోంది జయసుధ ఒకసారి పోటీ చేస్తే గెలిచారు మరోసారి ఓడిపోయారు.

తమిళనాట ఖుష్బూకి గుడులూ గోపురాలు కట్టించిన వారే ఆమె రాజకీయాన్ని పట్టించుకోవడంలేదు. అలాగే గ్లామర్ తార నగ్మా విషయంలో కూడా ప్రజలు పాలిటిక్స్ అంటే వేరేగా రియాక్ట్ అవుతున్నారు. ఇది వర్తమానం అయితే బీజేపీ ఇంకా సినిమా తారల చుట్టూ తిరుగుతూండడం చిత్రంగానే చూస్తున్నారు. సినిమా స్టార్ల సభలకు జనాలు వస్తారు, వారిని చూద్దామని ఆసక్తితో తప్ప వారు చెప్పేది విని బుర్రలకు ఎక్కించేసుకుని వారు చెప్పిన వారికి ఓటేద్దామనికాదు.

బీజేపీ ఈ విషయాలను గమనంలోకి తీసుకుందో లేదో తెలియడంలేదు కానీ షార్ట్ కట్ మెదడ్ అని సినిమా గ్లామర్ ని నమ్ముకుంటోంది. అయితే బీజేపీ సిద్ధాంతం కలిగిన పార్టీ. ఆ పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. వారిని జనంలోకి పంపించి పార్టీ ఫిలాసఫీని ప్రచారం చేసుకుంటే లేట్ అయినా కానీ పక్కాగా రాజకీయ‌ సౌధం నిర్మాణం అవుతుంది. అంతే తప్ప తారల తళుకు బెళుకులన్ను ముందు పెట్టుకుని జనాల వద్దకు వెళ్లాలని చూస్తే దాని వల్ల ఏ మేరకు రిజల్ట్స్ వస్తాయన్నది ఆ పార్టీ వారే ఆలోచించాలి.

ఇక సినిమా నటులు కూడా చాలా మంది రాజకీయాల గురించి పూర్తి అవగాహనతో ఉన్నారు. అందుకే తమకు శాలువాలు కప్పుతున్నా లేక పిలిచి మంతనాలు చేసినా నో పాలిటిక్స్ అనేస్తున్నారు. వారు తన సినీ కెరీర్ మీదనే దృష్టి పెడుతున్నారు. ఇక యువత సైతం ఇదివరకు మాదిరిగా హీరోలు అంటే చొక్కాలు చించుకుని పూనకాలు పోయే పరిస్థితిలో లేదు. వారు తమ కెరీర్ చూసుకుంటున్నారు.

ఇలా ఎవరికి వారు వాస్తవాలు తెలుసుకుని తమ పరిధుల మేరకు ఉంటే సినీ గ్లామర్ అనే నిచ్చెనతో రాజకీయం చేసి అధికారం అనే కుర్చీ అందుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా 1980 నాటివేనని అంతా అంటున్నారు. ఈ తరహా విన్యాసాలకు ఓట్లు రాలవు సరికదా బీజేపీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.