Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ - బీజేపీ బ‌స్తీమే స‌వాల్..!

By:  Tupaki Desk   |   15 July 2019 6:09 AM GMT
టీఆర్ ఎస్‌ - బీజేపీ బ‌స్తీమే స‌వాల్..!
X
తెలంగాణ‌లో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఉన్న టీఆర్ ఎస్‌ కు చెక్ పెట్టేందుకు బీజేపీ విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందుకోసం అవ‌స‌ర‌మైన అన్ని వ‌న‌రుల‌ను ఆపార్టీ వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంద‌ని - ఇదే అదునుగా అధికార టీఆర్ ఎస్‌ కు ధీటైన ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని క‌మ‌ల‌నాథులు భావిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాలు గెలుపొందడంతో ఆపార్టీ నేత‌లు మును పెన్నడూ లేనంత‌గా దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇత‌ర పార్టీల నుంచి వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. తాజాగా.. టీఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే సోమార‌పు స‌త్యానారాయ‌ణ బీజేపీలో చేరారు.

టీఆర్ ఎస్ పార్టీ కొద్ది రోజుల క్రితం స‌భ్య‌త్వ న‌మోదును ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే... టీఆర్ ఎస్‌ కు పోటీగా ఈసారి కాషాయ పార్టీ కూడా మేమున్నామంటూ స‌భ్య‌త్వ న‌మోదును ప్రారంభించింది. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే రంగంలోకి దిగి - రంగారెడ్డి జిల్లాలోని ఒక తండాలో గిరిజ‌న మ‌హిళ కుటుంబానికి స‌భ్యత్వం ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ‌తేడాది కంటే రెట్టింపు సంఖ్య‌లో స‌భ్య‌త్వాలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర నేత‌ల‌కు అమిత్‌ షా దిశానిర్దేశం చేయ‌డంతో రాష్ట్ర నేత‌లు ఈ మెంబ‌ర్ షిప్ డ్రైవ్‌ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈక్ర‌మంలోనే ఒక‌ప్పుడు స‌ఖ్య‌త‌గా మెదిలిన టీఆర్ ఎస్‌ - బీజేపీ మ‌ధ్య నేడు ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

రెండు పార్టీల నేత‌లు - పోటాపోటీగా స‌భ్యత్వాలను చేయిస్తుండ‌టంతో గ్రామాల్లో మ‌ళ్ళీ రాజకీయ హడావుడి క‌నిపిస్తోంది. ఇరు పార్టీల నేత‌లు ఇంటింటికీ తిరిగి త‌మ స‌భ్యత్వమే తీసుకోవాలంటూ ప్రజ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొన్నిసార్లు ఒకే ఇంటికి రెండు పార్టీల నేత‌లూ వెళ్ళి, స‌భ్యత్వ రుసుము ఇవ్వకున్నా స‌రే, ముందు ఆధార్డ్ కార్డ్ - ఫోటోలు తీసుకొని రిసిప్ట్ ఇచ్చి వెళుతున్నారంటే పోటీ ఏ ర‌కంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. గ‌తంలో టీఆర్ ఎస్ సభ్యత్వం తీసుకున్న వారిని త‌మవైపు తిప్పుకునేందుకు - బీజేపీ నేత‌లు ప్రయ‌త్నాలు చేస్తుంటే, ఇత‌ర పార్టీల కార్యకర్తల‌కు గులాబీ పార్టీ స‌భ్యత్వం ఇచ్చేందుకు టీఆర్ ఎస్ నేత‌లు శ్రమిస్తున్నారు.