Begin typing your search above and press return to search.

మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు బీజేపీ నోటీసులు...?

By:  Tupaki Desk   |   7 May 2023 9:49 PM IST
మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు  బీజేపీ  నోటీసులు...?
X
ఆయన బీజేపీలో ఉండలేకపోతున్నారు. అలాగని టీడీపీలో చేరలేకపోతున్నారు. పొత్తులు ఉంటే బాగుండును అని భావిస్తున్నారు. అయితే అది ఆయన స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. పార్టీలో ఉన్నపుడు హై కమాండ్ ఆలోచనలకు తగిన విధంగా వ్యవహరించాలని రూలుంది. బీజేపీ లాంటి పార్టీలలో వ్యక్తుల కంటే పార్టీ మిన్న అని భావిస్తారు. అయితే విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు హద్దులు దాటి మాట్లాడారు అని బీజేపీ హై కమాండ్ నోటీసులు జారీ చేసిందని ప్రచారం సాగుతోంది.

రాజు గారు వీకెండ్ ప్రోగ్రాం గా వచ్చే టీవీ చానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు అని బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా ఉందిట. ఈ మేరకు ఆయనకు షో కాజ్ నోటీసులు జారీ చేసిందని అంటున్నారు. ఈ మేరకు పార్టీ క్రమ శిక్షణా సంఘం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోందని అంటున్నారు.

ఆ టీవీ చానల్ లో రాజు మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి ఒక్క సీటూ రాదని చెప్పడం పట్ల కూడా బీజేపీ పెద్దలు కోపంగా ఉన్నారుట. ఏపీలో జనసేన టీడీపీల మధ్య పొత్తు ప్రస్తావన వస్తోంది. ఇక బీజేపీ కూడా ఆ పొత్తులో చేరుతుందా లేదా అన్నది ప్రచారంలోనే ఉంది. దీని మీద బీజేపీ పెద్దలు చివరి నిముషంలో తీసుకునే నిర్ణయం.

ఈ పొత్తుల వ్యవహారం అంతా జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారం. ఏపీలో ప్రెసిడెంట్ స్థాయిలో కూడా ఎవరూ పొత్తుల మీద పెద్దగా మాట్లాడరు. అలాంటిది రాజు గారు చనువు చేసుకుని ఎక్కువగానే మాట్లాడేశారు అని అంటున్నారు. దాంతో మీ స్థాయి మరచి మాట్లాడారు అని ఆయనకు క్రమశిక్షణా సంఘం నోటీసుకు జారీ చేసింది అని అంటున్నారు.

ఇక గతంలో కూడా రాజుని ఇలాంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించామని తాజా నోటీసులో పేర్కొన్నారని అంటున్నారు. ఇక చూస్తే కొంతకాలంగా ఆయన మనసు టీడీపీ వైపు ఉందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ పొత్తుతో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఒంటరి పోరులో ఓడారు. 2024లో పొత్తులు కోరుకుంటున్నారు. లేకపోతే తెలుగుదేశం వైపు వెళ్లాలని చూస్తున్నారు.

ఇటీవల బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణను ఆయన గుంటూరు కి పనిగట్టుకుని వెళ్ళి మరీ కలసి వచ్చారు దాని మీద కూడా హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఇవన్నీ చూస్తూంటే రాజు గారు తొందరపడుతున్నారా లేక పార్టీ నుంచి ఏ చర్యను కోరుకుంటున్నారు అన్నదే చర్చగా ఉంది. బీజేపీ టీడీపీల మధ్య పొత్తు విషయం అన్నది పై స్థాయిలో కనీస ఆలోచన లేదు కాబట్టే ఆయనకు నోటీసులు జారీ చేశారని కూడా అంటున్నారు ఆదివారం సాయంత్రం లోగా ఆయన్ని వివరణ ఇవ్వాలని పార్టీ కోరినట్లుగా చెబుతున్నారు.

ఈ చర్యతో రాజు తన రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటారా అని కూడా అంటున్నారు. అయితే టీడీపీ లేకపోతే జనసేన అన్నట్లుగా ఆయన పాలిటిక్స్ ఉందని అంటున్నారు. వైసీపీ వచ్చిన కొత్తలో ఆయన జగన్న్ని కూడా పొగిడార్. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టడాన్ని కూడా ఆయన పొగిడిన సందర్భం ఉంది. మొత్తానికి చూస్తే రాజు గారు కమలానికి దూరమా దగ్గరా అన్నది తొందరలొనే తేలిపోతుంది అని అంటున్నారు.