Begin typing your search above and press return to search.

క్రిష్ణా జిల్లా వైసీపీని ఫుల్లు గా కెలికేస్తున్న బాబు

By:  Tupaki Desk   |   15 April 2023 7:00 PM GMT
క్రిష్ణా జిల్లా వైసీపీని ఫుల్లు గా కెలికేస్తున్న బాబు
X
తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు క్రిష్ణా జిల్లా టూర్ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. ఆయన మచిలీపట్నం సభతో పాటు నిమ్మకూరు టూర్, అలాగే గుడివాడలో కొడాలి నాని ఇలాకాలో చేసిన బిగ్ సౌండ్ అన్నీ టీడీపీకి ఊపు తెచ్చేవే. 2019 ఎన్నికల్లో క్రిష్ణా జిల్లా టీడీపీని పక్కన పెట్టేసింది. ఎంతలా అంటే టీడీపీలో ఉన్న పెద్ద నాయకులు అలాగే బలమైన కమ్మ సామాజికవర్గం నేతలు అంతా కలసి జగన్ కి జై కొట్టేశారు.

ఇపుడు వారంతా తిరిగి టీడీపీ వైపు రానున్నారు. చంద్రబాబుకు ఆశ్చర్యకరంగా వైసీపీ నేతలు తాజా టూర్ లో స్వాగతం పలకడం విసేషం. ఎన్టీయార్ టైం నుంచి పార్టీలో ఉంటూ వచ్చిన దాసరి బాలవర్ధన్ రావు, దాసరి జై రమేష్ 2019 ఎన్నికల వేళ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో క్రిష్ణా జిల్లాలో వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడక అయింది.

దాసరి బ్రదర్స్ కి కొన్ని కీలక నియోజకవర్గాలలో పట్టుంది. అది వైసీపీ బాగా వాడుకుంది. అయితే పార్టీలో చేరి నాలుగేళ్ల కాలం గడచినా కూడా వారికి ఏ పదవీ రాలేదు. పైగా వైసీపీలో కమ్మ మంత్రి ఒక్కరూ లేకపోవడం, అమరావతి రాజధని ఇష్యూలో ఆ సామాజిక వర్గం పెద్దలే ఎక్కువగా దెబ్బ తినడం, అనేక నిర్ణయాల వల్ల కమ్మలు వైసీపీకి దూరం అవుతున్నారని అంటున్నారు.

ఇపుడు దాసరి బ్రదర్స్ కీలకమైన నిర్ణయమే తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు బందర్ టూర్ లో వారే దగ్గరుండి స్వాగత ఏర్పాట్లు చేశారని టాక్. ఫ్లెక్సీలను కూడా కట్టారు. ఇక నిమ్మకూరు గుడివాడలలో బాబు టూర్ లో వారు ఆయన వెంట ఉన్నారు. దీనికి కారణం ఏంటి అంటే తొందరలోనే దాసరి బ్రదర్స్ వైసీపీకి తలాఖ్ అనేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోతారని అంటున్నారు.

ఇక దాసరి బాలవర్ధనరావు చూపు గన్నవరం సీటు మీద ఉంది అని అంటున్నారు. ఆయన ఇక్కడ నుంచి 1999, 2009లలో రెండు సార్లు టీడీపీ తరఫున గెలిచారు. ఇక 2014, 2019 నాటికి వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చి టీడీపీ నుంచి గెలిచారు. ప్రస్తుతం వంశీ వైసీపీలో ఉన్నారు. దాంతో ఆయన ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ పరిణామాలే దాసరి బ్రదర్స్ లో కొత్త ఆశలు కల్పించాయని అంటున్నారు

అదే విధంగా చూస్తే గన్నవరంలో టీడీపీకి కూడా ఎవరూ బడా లీడర్ లేరు అంటునారు. మాజీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని పెట్టినా ఆయన ఈ మధ్యనే చనిపోయారు. దాంతో ఈ సీటు మీద బాలవర్ధనరావు కన్నేశారని తెలుస్తోంది. తొందరలో వారు టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయమని అంటున్నారు. అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న దాసరి బ్రదర్స్ టీడీపీ వైపు రావడం వైసీపీకి భారీ షాక్ అని అంటున్నారు.

అంతే కాదు సామాజికంగా రాజకీయంగా ఇది పెను ప్రభావమే చూపిస్తుంది అని అంటున్నారు. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన మరో కీలక నేత బొప్పన రవికుమార్ కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతారని అంటున్నారు. ఆయనకు గత ఎన్నికల్లో ఈ సీటు ఇస్తే ఓడిపోయారు. అక్కడ నుంచి గద్దే రామ్మోహన్ టీడీపీ తరఫున గెలిచారు. ఈసారి అక్కడ నుంచి వైసీపీ దేవినేని అవినాష్ ని నిలబెడుతోంది. దాంతో బొప్పన రవి కుమార్ కి ఏ ఛాన్స్ లేదని తేలిపోయింది.

ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి అయినా ఇస్తారని అనుకుంటే అది కూదా లేకుండా పోయింది. దాంతో ఆయన టీడీపీ రూట్ లోనే ఉన్నారని అంటున్నారు. ప్రజారాజ్యం తరఫున 2009లో విజయవాడ తూర్పు నుంచి ఫస్ట్ టైం గెలిచిన రవికుమార్ ఆ తరువాత తెలుగుదేశంలో చేరారు. కానీ ఆయన తన మిత్రుడు వంగవీటి రాధా పిలులు మేరకు వైసీపీ కండువా కప్పుకున్నారు. రాధా నాలుగేళ్ల క్రితమే వైసీపీని వీడిపోయారు. ఇపుడు రవికుమార్ అదే పనిలో ఉన్నారని టాక్.

ఈ ఇద్దరు నాయకులే కాకుండా క్రిష్ణా జిల్లాలో ప్రముఖ నాయకులు చాలా మంది వైసీపీ నుంచి టీడీపీకి రాయబారాలు పంపుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తున్న క్రమంలో వచ్చిన వారిని వచ్చినట్లే బాబు పార్టీలో చేర్చుకుంటారని అంటున్నారు. మొత్తానికి చాలా కాలానికి చంద్రబాబు క్రిష్ణా జిల్లా టూర్ పెట్టుకుని వైసీపీకి పూర్తిగా కెలికి వదిలేశారు అంటున్నారు. ఈ టూర్ పుణ్యమాని కొడాలి నాని గుడివాడలో సైతం సైకిల్ పార్టీకి హుషార్ వచ్చింది. కీలక నేతలు అంతా వైసీపీ నుంచి జారుకునే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏమి జరుగుతుందో.