Begin typing your search above and press return to search.

పదడుగుల ఎత్తున మంచు.. కేదార్ నాథ్ భక్తుల ప్రయాణం...ఎందుకంటే !

By:  Tupaki Desk   |   28 April 2020 11:30 AM GMT
పదడుగుల ఎత్తున మంచు.. కేదార్ నాథ్ భక్తుల ప్రయాణం...ఎందుకంటే !
X
ఉత్తరాఖండ్ లో అయిదుగురు కేదార్ నాథ్ భక్తులు ఆ దేవుడి పై భారం వేసి అతి పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఆరు నెలల పాటు మంచులో కప్పబడివున్న కేదార్ నాథ్ ఆలయాన్ని బుధవారం నాడు తిరిగి తెరవాల్సిఉన్న సమయంలో , సంప్రదాయబద్ధంగా నిర్వహించే పంచముఖి డోలీ యాత్రను దేవాలయానికి చెందిన ఐదుగురు భక్తులు నిర్వహించారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రకటించిన లాక్ డౌన్ తో పలువురు యాత్రికులు ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

ప్రతి ఏడాది చార్ ధామ్ యాత్ర ప్రారంభానికి ముందు కుమావో బెటాలియన్ ఆధ్వర్యంలో 1000 మంది యాత్రికులు పంచముఖి డోలీ యాత్రను నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కేవలం ఐదుగురు భక్తులు పంచముఖి విగ్రహాన్ని కేదార్ నాథ్ కు తరలించారు. లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా భక్తులెవరూ రాకపోయినా చలిలో గజగజ వణకుతూనే 10 అడుగుల మందంతో పేరుకుపోయిన మంచులోనే నడుస్తూ చిన్న పల్లకిలో పంచ ముఖ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు.

ఉత్తరాఖండ్ లోని నాలుగు ఆలయాలను మళ్ళీ తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. గర్వాలీ హిమాలయాల్లో గంగోత్రి, యమునోత్రి, ఆలయాలను శనివారం నాడే తెరిచారు. ఎత్తయిన హిమాలయాలపై ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బదరీ నాథ్ లను అన్నింటినీ కలిపి చార్ ధామ్ యాత్రగా పిలుస్తారు. హిందూ మత సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా, నాలుగు దేవాలయాలనూ తెరచి వుంచాలని నిర్ణయించినట్టు సత్పాల్ మహారాజ్ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. భక్తులు రాలేకపోయినప్పటికీ, ఆలయాల్లో పూజలు కొనసాగుతాయని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.