Begin typing your search above and press return to search.

బాలయ్యా... రెండవ వైపు చూడవయ్యా... ?

By:  Tupaki Desk   |   14 Dec 2021 2:30 PM GMT
బాలయ్యా... రెండవ వైపు చూడవయ్యా... ?
X
బాలక్రిష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి సింహా మూవీలో ఉంది. చూడూ ఒక వైపే చూడు, రెండవ వైపు చూడాలనుకోకు అంటూ. ఈ సినిమా వచ్చి పదకొండేళ్ళు అయినా డైలాగ్ మాత్రం ఈ రోజుకీ మారుమోగుతూనే ఉంటుంది. లేటెస్ట్ గా బోయపాటి, బాలయ్యల హ్యాట్రిక్ మూవీ అఖండ హిట్ తో సింహా గురించి కూడా అంతా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య సినీ జీవితం గాడిన పడింది.

హిట్లు లేక ఇబ్బంది పడిన నందమూరి హీరోకు అఖండమైన విజయమే చివరికి దక్కింది. ఈ ఊపుతో కచ్చితంగా మరో నాలుగైదేళ్ళ పాటు కెరీర్ కి ఎలాంటి ఢోకా ఉండబోదు. సరే సినీ జీవితానికి మంచి బాటలు వేసుకున్న బాలయ్య రెండవ వైపు ఎందుకు చూడరన్న ప్రశ్న అయితే వస్తోంది. ఆయన కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, రాజకీయ నేత కూడా.

టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్. హిందూపురానికి వరసబెట్టి రెండవమారు శాసనసభ్యునిగా గెలిచారు. అది కూడా జగన్ వేవ్ లో టీడీపీ నుంచి గెలిచిన అతి కొద్ది మందిలో బాలయ్య ఒకరు. ఇక సీమలో ముగ్గురే గెలిస్తే అందులో ఆయన ఒకరంటే ఎంత గ్రేటో కదా మరి.

అలాంటి బాలయ్య పూర్తిగా సినిమాలకే అంకితం అయిపోయారు అన్న విమర్శ అయితే ఉంది. ఏపీలో టీడీపీ ఎన్నడూ లేని విధంగా చితికిపోయి ఉంది. చంద్రబాబు ఎంతలా శ్రమిస్తున్నా కూడా టీడీపీకి హైప్ రావడంలేదు, జనాల్లో పాజిటివ్ వైబ్ కూడా రావడం లేదు, అంత దాకా ఎందుకు క్యాడర్ లో చురుకుదనం కూడా ఎక్కడా పుట్టడంలేదు. మరి ఇప్పటికే రెండున్నరేళ్ళ పుణ్య కాలం గడచిపోయింది.

ఇప్పటి నుంచే పార్టీకి మంచి రోజులు ఉన్నాయని గట్టిగా చెప్పి తమ వైపునకు ఫుల్ ఫోకస్ ఉండేలా చూసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యం. దాని కోసం చంద్రబాబు తన వంతు చేయాల్సింది చేస్తున్నారు. మరి ఎన్టీయార్ కుమారుడిగా, చంద్రబాబు వియ్యంకుడిగా బాలయ్య చేయాల్సింది చేస్తున్నారా అన్నదే పార్టీలో బయటా చర్చగా ఉంది. బాలయ్య అఖండ హిట్ తో లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇక ఆయనకు ఏపీవ్యాప్తంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఉన్నారు.

టీడీపీకి ఓటు బ్యాంక్ ఎన్టీయార్ కాలం నుంచి బాగానే ఉంది. మరి దాన్ని దీన్ని కలిపేలా జనాల్లోకి బాలయ్య వస్తే ఆ కధే వేరుగా ఉంటుంది అన్నదే తమ్ముళ్ల ఆశ. కానీ బాలయ్య సినిమా తరువాత సినిమా అంటున్నారు.

ఇప్పటికే రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఆయన మరి కొన్ని సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఇంతకీ బాలయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదా అన్న చర్చ కూడా ఉంది. మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు కదా. మరోసారి పోటీకి రెడీ అవుతారు కదా అంటే ఆయన పరిమితమైన బాధ్యతలెనే టీడీపీలో తీసుకున్నారు అంటున్నారు.

దానికి కారణం ఆయనకు 2014లో గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదు, ఇక 2024లో పార్టీ విజయం సాధించినా కూడా మంత్రి పదవి దక్కదు, ఎందుకంటే అప్పటికే లోకేష్, చంద్రబాబు క్యాబినెట్ లో కుదురుకుంటారు కాబట్టి. మొత్తానికి బాలయ్యకు రాజకీయ వైరాగ్యంతో పాటు అసంతృప్తి కూడా బాగా ఉందని అంటున్నారు.

అందుకే ఆయన ఏపీలో టీడీపీ మీద వైసీపీ గట్టిగా విరుచుకుపడుతున్నా కూడా పెద్దగా రియాక్ట్ కావడంలేదు అంటున్నారు. అలా కాకుండా లోకేష్ కి బదులుగా బాలయ్యని బాబు ప్రమోట్ చేస్తే కచ్చితంగా ఆయన సీరియస్ గానే రంగంలోకి దూకుతారు అన్నది మరో మాట. మొత్తానికి బాలయ్య రెండవ వైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతాయా. చూడాలి మరి.